దశల వారీ నిషేధం పిచ్చ లైట్.. కొత్తగా 10 బ్రాండ్లు.. ఏపీ సర్కారు నిర్ణయం

Update: 2022-11-16 05:01 GMT
ఎన్నికల వేళ.. ఓట్ల కోసం బోలెడన్ని చెబుతుంటారు రాజకీయ నాయకులు. అవన్నీ ఎందుకు చేస్తారు చెప్పండి? మాట మీద నిలబడే కుటుంబం మాది అంటూ తరచూ చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన పాలనలో తాను ఇచ్చిన మాటల మీద నిలబడటం తప్పించి.. మరింకే పని అయినా చేస్తారన్నట్లుగా ఆయన ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి బయటకు వచ్చింది.

2019 ఎన్నికలకు ముందు మాట్లాడిన జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలపై పూర్తిస్థాయిలో నియంత్రిస్తామని.. దశల వారీగా నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పటం తెలిసిందే.

ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తుందని చెప్పటం..దానిపై సాగిన రచ్చ తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విస్మయం వ్యక్తమవుతోంది.

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా... తాము మాట ఇచ్చిన దాని ప్రకారం మద్య నిషేధం.. దశల వారీగా మద్య నియంత్రణ అంశాన్నివదిలేసినట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్రాండ్లు సరిపోవన్నట్లుగా తాజాగా మరో పది కొత్త బ్రాండ్లకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు.. ఇప్పటికే ఉన్న  కేటగిరిలో ఉన్న బ్రాండ్లకు అదనంగా వచ్చే ఈ కొత్త బ్రాండ్లకు ధరలు ఎక్కువ పెట్టి అమ్ముకునే అద్భుత అవకాశాన్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం కొన్ని కేటగిరిలో బీరు బాటిల్ రూ.200 ఉంటే.. ఇప్పుడు అదే కేటగిరిలో కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ బీరు ధర రూ.220 గా చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ.110. కాగా.. కొత్తగా అనుమతి పొందిన మద్యం క్వార్టర్ ధర రూ.130గా ఉండటం గమనార్హం. ఇదంతా చూస్తే.. రేటు పెంచుకోవటానికి వీలుగా కొత్త బ్రాండ్ల రూపంలో అనుమతులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 300బ్రాండ్ల మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వగా.. ఇవి సరిపోవన్నట్లుగా తాజాగా మరో పది కొత్త బ్రాండ్లకు అమ్మటానికి వీలుగా అనుమతులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మద్యం ధరల్ని పెంచేందుకు అనుసరిస్తున్న షార్ట్ కట్ మార్గంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇలా కొత్త బ్రాండ్లు తీసుకొస్తూ పోతే.. దశల వారీ మధ్య నిషేదం మాట సంగతేంటి? అన్నది అసలు ప్రశ్న.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News