100 ఏళ్ల వయస్సు లో కరోనాను జయించిన వృద్ధుడు ..

Update: 2020-03-09 20:30 GMT
ప్రస్తుతం ప్రపంచంలోని 95 దేశాలకి పైగా విస్తరించిన కరోనా వైరస్ పేరు వింటేనే అందరూ ప్రాణ భయంతో గజగజ వణికిపోతున్నారు. అయితే, చైనా లోని వూహన్ సిటీలో పుట్టిన ఈ కరోనా వైరస్ , అక్కడ మరణమృదంగం మ్రోగించి , ఆ తరువాత ఇతరదేశాలకి వ్యాప్తిచెందింది. ఇక ఇప్పుడు చైనాలో ఈ వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో కల్పించిన వైద్య సదుపాయాలతో చైనాలో వైరస్‌ వ్యాప్తి తగ్గగా.. ఇతర దేశాల్లో మాత్రం దాని వేగం పెంచుకుంటూ పోతుంది.

చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని చెప్పడానికి .. తాజాగా అక్కడ ఒక సంఘటన జరిగింది. ప్రాణాంతకరమైన ఈ కరోనా వైరస్‌ బారిన పడిన 100 ఏళ్ల వృద్ధుడు కోలుకున్నారు. గత ఫిబ్రవరి 24న ఆస్పత్రిలో చేరిన ఈయన, ఐసోలేషన్ వార్డ్ లో 13 రోజులపాటు చికిత్స పొంది వైరస్‌ ను జయించారని హుబే ప్రావిన్స్‌ వైద్యులు తెలిపారు. ఆయన తన 101వ పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే హాస్పిటల్ పాలయ్యారు. ఇంటి వద్ద తన 92 ఏళ్ల భార్య నిరీక్షిస్తుందని, తాను త్వరగా ఇంటకి వెళ్లి ఆమె బాగాగులు చూసుకోవాలని చెబుతుండేవారని డాక్టర్‌ తెలిపారు. దీనితో ఈ కరోనా వైరస్ ని జయించిన పెద్ద వయస్కుడిగా అయన రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఆదివారం 98 ఏళ్ల హు హానియింగ్‌ కూడా కరోనా వైరస్‌ ను జయించి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు.

ఇకపోతే , చైనాలో ఇప్పటి వరకు 80వేల మందికి పైగా కరోనా వైరస్ బారినపడగా 3వేల మందికి పైగా కోల్పోయారు. గత రెండు, మూడు రోజులుగా చైనాలో కొత్త వైరస్‌ కేసులు గణనీయంగా తగ్గాయని చైనా వైద్యాధికారులు తెలిపారు. అంతేకాకుండా చాలామంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ కూడా అవుతున్నారని తెలిపారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష దాటింది.

ఇక ఈ కరోనా ప్రభావం ...కరోనా వైరస్ బయటపడ్డ చైనా లో తగ్గుముఖం పట్టినా కూడా, ఇతర దేశాలలో తన సత్తా ఏంటో చూపిస్తుంది. ప్రధానంగా ఇటలీ, ఇరాన్‌ దేశాలు కరోనా ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇరాన్‌ లో 49 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ఆదివారం ధృవీకరించారు. ఇటలీలో ఒక్కరోజే 133 మంది మరణించటంతో మృతుల సంఖ్య 366కు చేరుకుంది. ఇక ఈ మహమ్మారి భారత్‌లోనూ కొంచెం కొంచెంగా పుంజుకుంటోంది. సోమవారం కశ్మీర్‌, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ లలో బయటపడిన నాలుగు కేసులతో కలిపి వైరస్‌ బాధితుల సంఖ్య 43కి చేరింది. ఈ కరోనాని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Tags:    

Similar News