లోక్ సభ సభ్యుల సంఖ్య వెయ్యి అవుతుందా?

Update: 2019-12-17 05:45 GMT
లోక్ సభలో ప్రస్తుతం ఉన్న 543 మంది ఎంపీల స్థానే వెయ్యి మందికి పెంచాల్సిన అవసరం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తాజాగాఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లోక్ సభలోనూ..రాజ్యసభలోనూ సభ్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. దేశంలో పెరిగిన జనాభాకు తగ్గట్లు.. లోక్ సభ.. రాజ్యసభల్లో సభ్యుల సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారు.

1977లో చివరిసారిగా లోక్ సభలో సభ్యుల సంఖ్యను సవరించారన్న విషయాన్ని గుర్తు చేస్తూ..అప్పట్లో దేశ జనాభా 55 కోట్లు ఉంటే.. ప్రస్తుతం అంతకు రెట్టింపు జనాభా దేశంలో ఉందన్నారు. ప్రస్తుతం 16-18 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఒక ఎంపీ అంతమంది ప్రజలకు ఎలా చేరువ కాగలరని ప్రశ్నించారు.

బ్రిటన్ పార్లమెంటులో 650 మంది సభ్యులు ఉంటే కెనడాలో 443 మంది ఎంపీలు ఉన్న విషయాన్ని గుర్తు చేసిన ప్రణబ్ దా.. దేశంలోని పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రజాప్రతినిధులు.. ఓటర్ల సంఖ్య మధ్య నిష్పత్తిలో భారీ అసమానతలు ఉన్నాయన్నారు.

పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచటంతో పాటు.. రాష్ట్రాల్లోని అసెంబ్లీ సభ్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా ప్రణబ్ దా నోటి నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన ప్రధాని మోడీని ఆలోచనలో పడేయటం ఖాయమంటున్నారు. సంచలన నిర్ణయాల్ని తీసుకోవటం.. యుద్ధ ప్రాతిపదికన అమల్లోకి తీసుకొచ్చే మోడీ సర్కారు.. ప్రణబ్ దా మాటల్ని వాస్తవరూపంలోకి తీసుకొస్తే.. దేశ రాజకీయం కొత్త రూపులోకి మారటం ఖాయమని చెప్పక తప్పదు. అదే జరిగితే..లోక్ సభలో వెయ్యి మంది ఎంపీల మాట నిజమైనా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు.
Tags:    

Similar News