నాడు మ‌ర‌ణించింది 200 కాదు..10వేల మంది

Update: 2017-12-24 05:19 GMT
భ‌యంక‌ర‌మైన నిజం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌పంచానికే దిమ్మ తిరిగిపోయే షాకింగ్ నిజం ఒక‌టి ర‌హ‌స్య ప‌త్రాల పుణ్య‌మా అని బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌పంచం ఉలిక్కిప‌డే నిజాన్ని బ్రిట‌న్ ర‌హ‌స్య‌ప‌త్రం ఒక‌టి బ‌య‌ట‌కు తెచ్చింది. చైనా చ‌రిత్ర‌లోనే చీక‌టి అధ్యాయంగా మిగిలిన తియాన‌న్మెన్ ఘ‌ట‌న‌లో ఆందోళ‌న చేస్తున్న వారు.. పోలీసులు మొత్తంగా 200 మంది చ‌నిపోయిన‌ట్లుగా చెప్పిన మాట‌ల‌న్ని ఉత్త‌వేన‌న్న విష‌యం తేలిపోయింది.

ప్ర‌జాస్వామ్యం కోసం యువ‌త‌.. విద్యార్థులంతా క‌లిసి ఆందోళ‌న చేప‌ట్టేందుకు తియాన‌న్మెన్ స్వేర్ వ‌ద్ద భారీ ఆందోళ‌న‌ను నిర్వ‌హించారు.దీన్ని చైనా క‌మ్యునిస్ట్ ప్ర‌భుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. సాయుధ బ‌ల‌గాల్ని రంగంలోకి దింపి.. ఆందోళ‌న చేస్తున్న వారి నోట మాట రాకుండా చేయ‌ట‌మేకాదు.. మ‌ళ్లీ ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు తెలియ‌జేయాల‌న్న ఆలోచ‌న రావ‌టానికే భ‌య‌ప‌డేలా చేశారు.

నాటి ఘ‌ట‌న‌లో 200 మంది చ‌నిపోయి ఉంటార‌న్న మాట‌ను చైనా ప్ర‌భుత్వం చెప్పింది. అయితే.. అదంతా బూట‌క‌మ‌న్న విష‌యం తాజాగా తేలింది. బ్రిట‌న్ తాజాగా విడుద‌ల చేసిన ర‌హ‌స్య ప్ర‌త్రాలు దాదాపు మూడు ద‌శాబ్దాల క్రితం జ‌రిగిన ఘోరాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా చేస్తున్నాయి. 1989 జూన్ 3.. 4 తేదీల మ‌ధ్య జ‌రిగిన దారుణాన్ని..చైనాలో ఉన్న అప్ప‌టి బ్రిట‌న్ రాయ‌బారి అల‌న్ డొనాల్డ్ టెలిగ్రామ్ ద్వారా త‌న‌కందిన స‌మాచారాన్ని స్వదేశానికి చేర‌వేశాడు.

ప్ర‌జాస్వామ్య భావ‌న‌ల్ని పాత‌రేసిన వైనాన్ని దారుణం జ‌రిగిన‌త‌ర్వాత రోజున బ్రిట‌న్‌కు స‌మాచారాన్ని పంపారు. తియాన‌న్మెన్‌స్వేర్  వ‌ద్ద వారం రోజులుగా ఆందోళ‌న చేస్తున్న వారిని క‌ట్ట‌డి చేసేందుకు చైనా సాయుధులు నిర‌స‌న చేస్తున్న ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. ఆందోళ‌న‌ను విర‌మించ‌టానికి గంట స‌మ‌యం ఇస్తార‌ని భావించారు.

వేలాది మందితో పోటెక్కిన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ఐదు నిమిషాలు కూడా టైమివ్వ‌కుండా నిర‌స‌న చేస్తున్న వారు.. అక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసులు అన్న తేడా లేకుండా విచ‌క్ష‌ణార‌హితంగా  సైనికులు కాల్పులు జ‌రిపారు.

అన్నింటికంటే దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లుగా కాల్చేయ‌ట‌మే కాదు.. త‌ర్వాత వారి మృత‌దేహాల మీదుగా భారీ వాహ‌నాల్ని తొక్కించారు. త‌ర్వాత బుల్ డోజ‌న్ల‌తో మృత‌దేహాల్నిత‌ర‌లించి కాల్చేశారు. నాడు జ‌రిగిన దారుణంలో 200 మంది మ‌ర‌ణించి ఉంటార‌న్న ప్ర‌చారం జ‌రిగినా.. వెయ్యి మంది వ‌ర‌కూ మ‌ర‌ణించి ఉంటార‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి. .తాజాగా వెలువ‌డిన ర‌హ‌స్య ప‌త్రాల నేప‌థ్యంలో తియాన‌న్మెన్ స్వేర్ వ‌ద్ద‌ 10వేల మంది మ‌ర‌ణించిన‌ట్లుగా తేలింది. చైనా ప్ర‌భుత్వంలో కీల‌క స్థానంలో ఉన్న ఓ వ్య‌క్తి స్నేహితుడి ద్వారా త‌న‌కీ దారుణ ఘ‌ట‌నకు సంబంధించిన స‌మాచారం అందిన‌ట్లుగా అల‌న్ డొనాల్డ్ ప‌త్రాలు తాజాగా వెల్ల‌డించాయి.
Tags:    

Similar News