11 మందికి 11 పైపులు..తాంత్రిక ఆత్మ‌హ‌త్య‌లా?

Update: 2018-07-02 14:22 GMT
ఢిల్లీలో బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11మంది వ్య‌క్తులు సామూహికంగా మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిస విష‌యం తెలిసిందే. బురారీలో నివ‌సించే భాటియా కుటుంబానికి ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ‌ని - మోక్షం కోసం ఆ కుటుంబ‌మంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిందేమోన‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే, చ‌నిపోయిన 11 మంది చ‌దువుకున్న వార‌ని - మోక్షం కోసం ఆత్మహత్యలకు పాల్పడేంత మూర్ఖులు కారని మృతుల బంధువులు చెబుతున్నారు. ఆ 11 మంది మృత‌దేహాల‌కు పోస్టుమార్టం కూడా పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ఈ కేసు మిస్ట‌రీని ఛేదించేందుకు పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఆ విచార‌ణ‌లో కొన్ని షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ ఇంటి లోప‌లి గోడ నుంచి బ‌య‌ట‌కు చొచ్చుకు వచ్చిన 11 పైపులు ...ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇంట్లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని అనుమానిస్తున్న 11 మందికి ....ఈ 11 పైపుల‌కు ఉన్న సంబంధం ఏమిట‌ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

అందులోనూ ఆ పైపుల్లో 7 పైపులు బెండ్ చేసి ఉండ‌గా...4 పైపులు మామాలుగా ఉన్నాయి. ఆ 7 పైపులు చ‌నిపోయిన మ‌హిళ‌ల సంఖ్య‌ను - ఆ 4 పైపులు చ‌నిపోయిన పురుషుల సంఖ్య‌ను సూచించ‌డంపై పోలీసులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. పైగా ఆ పైపుల‌కు అవ‌త‌లివైపుకు ఎటువంటి క‌నెక్ష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డంతో....దాదాపుగా వారంతా తాంత్రిక పూజ‌లు - విశ్వాసాల నేప‌థ్యంలోనే ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. బ‌హుశా త‌మ సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల గురించి ఆ ఇంటి పెద్ద నారాయ‌న్ దేవి ఎవ‌రిక‌న్నా చెబుతుందేమోన‌న్న అనుమానంతో ఆమె గొంతు నులిమి చంపి ఉంటార‌ని - అందుకే ఆమె శ‌వం మాత్ర‌మే నేల‌పై పడి ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు. 2015 నుంచే వీరంతా  మోక్షానికి సంబంధించిన నోట్స్ రాస్తున్నార‌ని - వాటిపై లోతుగా విచార‌ణ జ‌ర‌పాల‌ని పోలీసులు చెబుతున్నారు. నారాయ‌న్ దేవి మ‌నుమ‌రాలు ప్రియాంక‌కు గ‌త నెల‌లో నిశ్చితార్థం కూడా అయిన నేప‌థ్యంలో ఈ ఘోర‌క‌ళి స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. అయితే, ఈ డెత్ మిస్ట‌రీని ఛేదించేందుకు పోలీసులు లోతుగా విచార‌ణ చేప‌ట్టారు.

Tags:    

Similar News