అమరావతికి మ‌రో 14 వేల ఎక‌రాలు కావాల‌ట‌

Update: 2017-06-17 07:30 GMT
ఒక రాజ‌ధాని న‌గ‌రం ఎంత ఉండాలి? ఈ సూటి ప్ర‌శ్న‌కు ఒక్కొక్క‌రు ఒక్కో స‌మాధానం చెబుతుంటారు. మొత్తంగా చూస్తే.. రాజ‌ధాని న‌గరానికి వేలాది ఎక‌రాలు అవ‌స‌రం లేదన్న మాట ప‌లువురి నోట వినిపిస్తుంటుంది. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు మాత్రం అందుకు భిన్నంగా క‌నిపిస్తాయి. మొద‌ట వేసిన లెక్క ప్ర‌కారం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం 33 వేల ఎక‌రాలు స‌రిపోతాయ‌ని అంచ‌నా వేశారు.

నిజానికి ఇంత భారీగా భూములు అవ‌స‌ర‌మా? అన్న సందేహం వ్య‌క్త‌మైనా.. భావి రాజ‌ధాని కోసం ఆ మాత్రం భూమి లేకుంటే ఎలా అన్న మాట‌తో ఎవ‌రూ ఏమీ అన‌లేదు. బాబు కోరిన‌ట్లే.. రైతులు త‌మ భూముల్ని వేలాదిగా ఇచ్చేశారు. తాజాగా సేక‌రించిన 33 వేల ఎక‌రాలు స‌రిపోవ‌న్న‌ది ఏపీ ముఖ్య‌మంత్రి మాట‌గా మారింది.

మ‌రో 14 వేల ఎక‌రాల భూమిని రెండో ద‌శ‌లో సేక‌రించాల‌ని భావిస్తున్నారు. ఆ సేక‌రించిన భూమిలో ఇత‌ర ప్రాజెక్టులు, ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు  ఇన్న‌ర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా భూమి  కేటాయించ‌నున్నారు.

వాస్త‌వానికి సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు.. ఏపీ రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం విష‌యంలో ఒక్క ఎక‌రా భూమిని కూడా రైతుల నుంచి తీసుకోమ‌ని అప్ప‌ట్లో త‌న‌కు చెప్పిన‌ట్లుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక సంద‌ర్భంలో చెప్పారు. కానీ.. అందుకు భిన్నంగా 33వేల ఎక‌రాలు రైతులు నుంచి తీసుకోవ‌టం అర్థం కానిదిగా చెప్పాలి. ఇది స‌రిపోన‌ట్లు తాజాగా మ‌రో 14 వేల ఎక‌రాల సేక‌ర‌ణ కోసం ఏపీ స‌ర్కారు పావులు క‌ద‌ప‌టం.. అందుకు త‌గ్గ‌ట్లు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇలా పెంచుకుంటూ పోతే.. ఎన్ని వేల ఎక‌రాలు కూడా స‌రిపోవ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంది. రాజ‌ధాని కోసం చేప‌ట్టిన భూసేక‌ర‌ణ విష‌యంలో ఇప్ప‌టికే ప‌లు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబు స‌ర్కారు.. తాజాగా చేప‌ట్టిన భూసేక‌ర‌ణ మ‌రిన్ని వివాదాల‌కు తెర తీసే అవ‌కాశం ఉందంటున్నారు. భూముల విష‌యానికి వీలైనంత దూరంగా ఉండ‌టం ఏపీ స‌ర్కారుకు మంచిద‌ని..లేకుంటే చంద్ర‌బాబుకు ఫ్యూచ‌ర్ లో మ‌రింత న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతున్న రాజ‌ధాని భూముల సేక‌ర‌ణ విష‌యంలో చంద్ర‌బాబు కాస్తంత జోరు త‌గ్గిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News