మజ్లిస్ నేత అసందర్భ ప్రేలాపన

Update: 2020-02-21 06:15 GMT
నియంత్రణ తగ్గుతోంది. సంచలనం అంతకంతకూ పెరుగుతోంది. నేతగా ఎస్లాబ్లిష్ కావాలంటే నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే మీడియా అటెన్షన్ తో పాటు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి.. ప్రముఖుడిగా మారిపోవచ్చన్న దుర్మార్గం అంతకంతకూ పెరుగుతోంది. నేతల నోటి నుంచి వచ్చే బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ప్రజల మధ్య అనవసరమైన భావోద్వేగాల్ని రగిలే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఉన్నాయి మజ్లిస్ పార్టీకి చెందిన నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు.

వారిస్ పఠాన్ అనే మజ్లిస్ నేత తాజాగా విదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే వంద కోట్ల మెజార్టీ ప్రజలకు సమాధానం చెప్పేందుకు 15 కోట్ల మంది ఉండే ముస్లింలు సరిపోతారన్నారు. ఆయనీ మాటల్ని పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలోనే చేయటం గమనార్హం.పార్టీ అధినేత సమక్షంలో అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్న పార్టీ నేతను కంట్రోల్ చేయని అసద్ తీరును తప్పు పడుతున్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారిస్.. పౌరసత్వానికి సంబంధించి పత్రాలు చూపించమంటే తన గుండెల్లోకి తూటా దింపాలని అడుగుతానని వ్యాఖ్యానించారు. ‘‘మేం 15 కోట్ల మందే ఉండొచ్చు. కానీ వంద కోట్ల మెజార్టీ జనాభా కంటే శక్తివంతులం. మీ స్వాతంత్య్రాన్ని కొల్లగొట్టే సామర్థ్యం మాకుంది. ముస్లిం మహిళలు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి. అలాంటిది మొత్తం ముస్లిం సమాజం ఒక్కటై కదిలితే ఏం జరుగుతుందో మీకు తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టేలా చేస్తున్న ఈ తరహా వ్యాఖ్యలతో నష్టమే తప్పించి లాభం ఉండదు. సంచలనాల కోసం ఈ తరహా వ్యాఖ్యలకు తెగబడే నేతల్ని వారించి.. వారికి వార్నింగ్ ఇచ్చే ఒకప్పటి అధినేతల స్థానే ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్న పార్టీ అధినేతలు దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News