కోనసీమ అల్లర్లలో ఇప్పటివరకు 150 మంది గుర్తింపు

Update: 2022-05-28 04:16 GMT
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురంలో మే 24న జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి పోలీసులను 150 మందిని నిందితులను గుర్తించారు. వీరంతా దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారేనని పోలీసులు చెబుతున్నారు. వీరిలో అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. అలాగే ఒకరిద్దరు టీడీపీ, బీజేపీకి చెందినవారు ఉన్నారని సమాచారం. ఇప్పటికే 19 మందిని మే 26న గురువారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కాగా మే 27న శుక్రవారం మరో 24 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారం (మే 28న) మరికొన్నిఅరెస్టులు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 350కిపైగా సీసీ టీవీ ఫుటేజీలు, వీడియో క్లిప్పింగులను పోలీసులు నిశితంగా విశ్లేషించారు. మిగిలిన 107 మంది కోసం పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. అలాగే దాడుల్లో పాల్గొన్న మరో 200 మందిని గుర్తించాల్సి ఉంది.

కాగా పోలీసులు దాదాపు 20 వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులను విశ్లేషిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని పోలీస్‌ టెక్నాలజీ సర్వీసెస్‌, సైబర్‌ క్రైమ్‌ విభాగాలకు చెందిన నిపుణులు రెండు రోజులుగా ఇదే పనిలో ఉన్నారు. విద్వేషకర పోస్టులు ఎక్కడి నుంచి మొదట వ్యాప్తిలోకి వచ్చాయనే అంశంపై పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా చెప్పుకునే ఓ కీలక నేత పాత్రను పోలీసులు గుర్తించారు. అతడికి కుడి భుజం లాంటి మరో నేతతోపాటు అమలాపురం పట్టణానికి చెందిన కొందరు రౌడీషీటర్లు కూడా దాడులకు పాల్పడ్డట్టు పోలీసులు స్పష్టమైన అంచనాకొచ్చారు.

అమలాపురంలో జరిగిన అల్లర్లలో అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు మిగిలిన పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు మాత్రం వీరికి ఇంకో నగరం నుంచి వచ్చాయని అంటున్నారు. ఈ దిశగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారని సమాచారం. ఇంకో నగరం నుంచి వచ్చిన ఆదేశాలనే నిందితులంతా క్షేత్ర స్థాయిలో అమలు చేశారని గుర్తించారు. ఈ అల్లర్లకు కొందరు ఆర్థిక సహకారం అందించడంతోపాటు ఇతరత్రా అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో నిందితులకు ఈ ఆదేశాలు ఇచ్చిన కీలక వ్యక్తులెవరనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. త్వరలోనే ఈ అల్లర్ల కుట్రను చేధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

కాగా అమలాపురం పట్టణంలో శుభ కలశం సెంటర్‌ నుంచి మెయిన్‌ రోడ్డు, గడియారం స్తంభం సెంటర్‌, ముమ్మిడివరం గేట్‌ సెంటర్‌, నల్లవంతెన, ఎర్ర వంతెన, రవాణా శాఖ మంత్రి విశ్వరూప్, ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ నివాసాల వద్ద సీసీ కెమెరాల పుటేజీలను సేకరించినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ జి.పాలరాజు తెలిపారు. అల్లర్లు, విధ్వంసం కేసును మొత్తం 12 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని వివరించారు. మొత్తం 80 మంది పోలీసులు అధికారులు దర్యాప్తులో పాల్గొంటున్నారని వెల్లడించారు.

మరోవైపు అమలాపురం అల్లర్లు, విద్వంసానికి సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యద్ధం జరుగుతోంది. మీరంటే మీరు కారణమని ఒకదానికొకటి ఆరోపించుకుంటున్నాయి. సోషల్ మీడియా అంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలే ఈ అల్లర్లకు పాల్పడ్డారని నొక్కి వక్కాణిస్తోంది. మరోవైపు జగన్ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన కార్యకర్తలందరినీ జనసేన, టీడీపీ కార్యకర్తలుగా పేర్కొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులు మంత్రి పినిపె విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డితో, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం ఇందుకు ఊతమిస్తోంది.
Tags:    

Similar News