కాంగ్రెస్ లో 1999 సీన్ తాజాగా రిపీట్‌!

Update: 2019-06-01 11:31 GMT
దాదాపు 20 ఏళ్ల క్రితం. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దీన స్థితి ఎదుర్కొందో తాజాగా అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది. అప్ప‌ట్లో మునిగిపోయే నావలా ఉన్న కాంగ్రెస్ కు చుక్కానిలా మారి.. త‌న సార‌థ్యంలో పార్టీ ప‌వ‌ర్లోకి వ‌చ్చేలా చేసిన సోనియాగాంధీకి తాజాగా మ‌రోసారి కాంగ్రెస్ కాడెద్దు మోయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. త‌న రాజ‌కీయ వార‌సుడు రాహుల్ గాంధీ అలిగిన వేళ‌.. ప‌రాజ‌య ప‌గ్గాలు ప‌ట్టుకోవ‌టానికి ఇష్టం చూపించ‌ని నేప‌థ్యంలో.. తాను త‌ప్పించి మ‌రెవ‌రూ క‌నిపించ‌ని వేళ‌.. కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా సోనియాగాంధీను ఎన్నుకున్నారు.

మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ సోనియా అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌తిపాదించ‌గా.. మిగిలిన స‌భ్యులంతా ఓకే చేశారు. తాజాగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రాజ‌యానికి బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేస్తానంటూ అల‌క‌బూనిన రాహుల్.. కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు ఆస‌క్తి చూప‌లేదు. దీంతో.. సోనియా త‌ప్పించి కాంగ్రెస్ కు మ‌రో గ‌త్యంత‌రం లేకుండా పోయింది.

ఈ నేప‌థ్యంలో సోనియాను ఎన్నుకున్న‌ట్లు కాంగ్రెస్ వెల్ల‌డించింది. పార్ల‌మెంటు హాలులో జ‌రిగిన స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ లోక్ స‌భ స‌భ్యులు 52 మంది.. రాజ్య‌స‌భ స‌భ్యులు 52 మంది హాజ‌ర‌య్యారు. గ‌డిచిన కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న రాహుల్ తాజాగా జ‌రిగిన స‌మావేశంలో పెద‌వి విప్పారు. కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ప్ర‌సంగించిన ఆయ‌న‌.. ఎప్ప‌టిలానే తాను బీజేపీ పైనా.. న‌రేంద్ర మోడీపైనా పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ పూర్వ‌వైభ‌వాన్ని సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. దాన్ని సాధించి తీరుతామ‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే లోక్ స‌భ‌లో కాంగ్రెస్ కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కాలంటే మ‌రో మూడు సీట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా రాహుల్ ను ఎంపిక చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా ఆయ‌న స‌సేమిరా అన్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సోనియా తాను ఆ ప‌ద‌విని స్వీకరించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. విదేశీ మ‌హిళ అయిన సోనియా ప‌ద‌విని చేప‌ట్టటాన్ని స‌సేమిరా అన్న ప‌వార్.. సంగ్మా.. తారిఖ్ అహ్మ‌ద్ లు పెద్ద ఎత్తున వ్య‌తిరేకించారు. ప‌వార్ అయితే ఏకంగా పార్టీ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు పార్టీ నాయ‌కుడ్ని ఎన్నుకోవ‌టానికి విప‌రీతంగాప్ర‌య‌త్నించి.. చివ‌ర‌కు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సోనియాను ఎన్నుకోక త‌ప్ప‌లేదు.
Tags:    

Similar News