కుటుంబానికి 1 సీటు..కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల

Update: 2018-10-13 07:46 GMT
అనుకున్నది.. అయ్యిందొకటిలా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి.. ఏదో అనుకుంటే ఏదో అయ్యేలాగానే ఉంది. మహాకూటమి పెట్టి అన్ని పార్టీలను కలుపుకొని కేసీఆర్ ను ఓడిద్దామని ప్లాన్ చేస్తుంటే.. సొంత పార్టీ నేతలే టికెట్ల కోసం పార్టీలు మారడం ఇప్పుడు కాంగ్రెస్ ను కలవరపెడుతోంది.. ఆంధోల్ ఎమ్మెల్యే అభ్యర్థి.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా భార్య పద్మినిరెడ్డి కాంగ్రెస్ టికెట్ దక్కదని భావించి బీజేపీలో చేరిపోయారు. అనంతరం దుమారం రేగడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. దీనంతటికి కాంగ్రెస్ ‘ఒక కుటుంబానికి ఒక టికెట్’ వ్యవహారమే కారణం..

నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెట్టిన ఈ రూల్ ను తెలంగాణ పీసీసీ కఠినంగా అమలు చేస్తోంది. ఒక కుటుంబానికి ఒక్క సీటే అనడంతో ఇటు జానారెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి,  భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి సహా చాలా మంది వారసులు, కుటుంబసభ్యులు పోటీకి దూరమవుతున్నారు. వీరంతా బలమైన గెలిచే అభ్యర్థులే. అయినా కాంగ్రెస్ రూల్ పెట్టుకొని వీరికి సీట్లు ఇవ్వడం లేదు. ఇదే ఆ పార్టీకి మైనస్ గా మారుతోంది. దీంతో వీరంతా ప్రత్యామ్మాయంగా బీజేపీలో చేరిపోతున్నారు.

ఇంత కఠినమైన రూల్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కు ఎందుకు మినహాయింపునిచ్చారని సీనియర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారట. తమకో రూల్.. ఉత్తమ్ కు ఒక రూలా.? అని ప్రశ్నిస్తున్నారు. ఉత్తమ్ హూజూర్ నగర్ నుంచి పోటీచేస్తుండగా.. ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీచేస్తోంది. కాంగ్రెస్ ఒక కుటుంబానికి ఒక సీటు అంటే పద్మావతికి కూడా ఇవ్వవద్దని కాంగ్రెస్  అసమ్మతి వాదులు వాదిస్తున్నారు.. సీనియర్ నేత జానారెడ్డి తన కొడుక్కి మిర్యాల గూడ కోసం ప్రయత్నించినా ఇవ్వని అధిష్టానం.. ఉత్తమ్ కు మాత్రం ఆ వెసులుబాటు ఎందుకు కల్పించిందని లోలోపన కుమిలిపోతున్నాడట.. మిగతా నేతలు సైతం ఈ వాదననే వ్యక్తం చేస్తున్నారట..

ఇప్పటికే దామోదర భార్య బీజేపీలో చేరి వచ్చిందని.. టికెట్లు ఖరారయ్యాక చాలా మంది బలమైన కాంగ్రెస్ నేతల వారసులు కూడా బీజేపీలోచేరి గెలుస్తారేమోనన్న సందేహం కాంగ్రెస్ అధిష్టానాన్ని వేధిస్తోంది. నిజానికి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలనే బీజేపీ ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తోందా అన్న ఆందోళన కూడా కాంగ్రెస్ ను వెంటాడుతోందట.. ముందస్తు ఎన్నికల వేళ ఒక ఇంటికి ఒక సీటు వ్యవహారం కాంగ్రెస్ లో అసమ్మతికి ఆజ్యం పోస్తోంది.
Tags:    

Similar News