ఏపీలో విద్యుత్ సంక్షోభం.. నేటి నుంచి ప‌వ‌ర్ హాలీడే

Update: 2022-04-08 03:26 GMT
ఏపీలో విద్యుత్ కు సంక్షోభం లేద‌ని... ఆల్ ఈజ్ వెల్ అని.. ప్ర‌తిప‌క్షాలు.. ఒక వ‌ర్గం మీడియా ప‌నిగ‌ట్టుకుని త‌మ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నాయ‌ని.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం చెప్పిన‌.. వారం రోజులే.. సంక్షోభం బ‌య‌ట ప‌డింది. విద్యుత్ క‌ర‌త‌తో గ్రామాలు.. ప‌ట్ట‌ణాల్లో విద్యుత్ కోత విధిస్తున్న స‌ర్కారు.. ఏకంగా.. ప‌రిశ్ర‌మ‌ల‌కు.. ప‌వ‌ర్ హాలీడే ప్ర‌క‌టించింది.  పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించుకోవాలని.. నిరంతరాయంగా పనిచేసే (24 గంటలూ) పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50% విద్యుత్తు మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది.

అంటే.. ఇక‌పై రాష్ట్రంలోని ప‌రిశ్ర‌మ‌లు ఏవైనా కూడా.. వారానికి 4 రోజులు మాత్ర‌మే.. ప‌నిచేస్తాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మళ్లీ 2014 ముందు నాటి పరిస్థితు లు పునరావృతం కానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికుల ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున దెబ్బతీయనుంది. అసలే పెట్టుబడులు రావడం లేదు, కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. ఉన్న పరిశ్రమలు కూడా ప్రస్తుత విద్యుత్తు వాడకంలో 50% మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. కార్మికులు రోడ్డున పడే పరిస్థితి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు పారిశ్రామిరంగం కుదేలైంది. కార్మికులూ ఉపాధి కోల్పోయారు. ఇప్పుడిప్పు డే పరిస్థితులు కుదుట పడుతున్నాయనుకునే సమయంలో.. ప్రభుత్వం పవర్‌ హాలిడే ప్రకటించింది. ఉపాధి పోతే పూట గడిచేదెలా? అని కార్మికులు కలవరపడుతున్నారు. దీంతో ఆక‌లి చావులు వ‌చ్చినా.. ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. నిర్దేశించిన సమయానికి ఉత్పత్తుల్ని సిద్ధం చేయలేకపోతే.. తీవ్రంగా నష్టపోతామని అప్పులు తెచ్చి రూ.కోట్లలో పెట్టుబడి పెట్టిన పరిశ్రమల యజమానులు వణికిపోతున్నారు.

ఎక్క‌డెక్క‌డ ఎలా?

దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని 253 నిరంతర ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తమ రోజువారీ విద్యుత్తు వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. 1,696 ఇతర పరిశ్రమలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వారాంతపు సెలవుకు అదనంగా ఒకరోజు పవర్‌ హాలిడే అమలు చేయనున్నారు.

ఎస్పీడీసీఎల్‌ పరిధిలో చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు శుక్రవారం పవర్‌ హాలిడే అమలు చేయనున్నట్లు సీఎండీ హరనాథరావు తెలిపారు. పుత్తూరు మినహాయించి మిగిలిన అన్ని డివిజన్లలోనూ ఇది అమలవు తుందని తెలిపారు.

 ‘రాష్ట్రంలో రోజుకు 40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా సరిపడా విద్యుత్తు అందుబాటులో లేకపోవడంతో.. రాష్ట్ర అవసరాలకు తగినంత కొనలేకపోతున్నాం. దేశవ్యాప్తంగా పంటల ముగింపు కాలం, వడగాలుల కారణంగా ఎక్స్ఛేంజీలోనూ విద్యుత్తు అందుబాటులో లేదు. పంట కోతలు ముగిసిన తర్వాత వచ్చే 15 రోజుల్లో డిమాండ్‌ తగ్గే అవకాశం ఉంది’ అని ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గృహ, వ్యవసాయ అవసరాలకు సరఫరాలో ఆటంకం లేకుండా చూసేందుకు పరిశ్రమలకు సరఫరాను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే... రాష్ట్రం అంధ‌కార బంధురంగా మారుతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News