అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు కొత్త బెదిరింపు

Update: 2017-09-02 08:39 GMT
త‌మిళ‌నాడులో అధికార పార్టీలో కొత్త ట్విస్ట్‌ లు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే విలీనమైన అధికార అన్నాడీఎంకె వర్గాలు ఈ నెల 12న నిర్వహించనున్న జనరల్ కౌన్సిల్ - కార్యనిర్వాహక కమిటీ సమావేశాలకు హాజరు కావొద్దని శశికళ వర్గానికి చెందిన ప్రధాన కార్యదర్శి దినకరన్  పార్టీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన మొత్తం సభ్యుల్లో ఐదోవంతు మంది లిఖితపూర్వకంగా ఆమోదిస్తే తప్ప జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడానికి వీల్లేదన్నారు. కాగా ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించే అధికారం ఉందని తెలిపారు. అంటే ప్రస్తుతం కర్నాటక జైల్లో వున్న పార్టీ ప్రధాన కార్యదర్శి వి.కె.శశికళకే ఈ అధికారం ఉందని, ఆమె ఆదేశిస్తే తప్ప జనరల్ కౌన్సిల్ - ఎగ్జిక్యూటివ్ కమిటీని సమావేశపరచడానికి వీల్లేదని దినకరన్ తెలిపారు.

ముఖ్యమంత్రి పళనిస్వామి - ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్వహించాలనుకున్న ఈ సమావేశం చట్టవిరుద్ధమన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు వీటికి హాజరుకాకూడదని - హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్‌ లో జయలలిత మరణానంతరం ఆపద్ధర్మ ప్రధాన కార్యదర్శి గా శశికళ నియమితమైన విషయం తెలిసిందే. ఈ నెల 12న అధికార అన్నాడీఎంకె ఈ సమావేశాలను నిర్వహించాలనుకోవడంలో ఉద్దేశం శశికళను బహిష్కరించడమేనని చెబుతున్నారు. కాగా, ఇదివ‌ర‌లోనే తమిళనాడు సీఎం పదవి నుంచి తక్షణమే వైదొలగడం ఎంతైనా మంచిదంటూ పళనిస్వామిని దినకరన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. లేనిపక్షంలో అన్నాడీఎంకెలో తనకు ఉన్న అజ్ఞాత మద్దతుదారులను తెరమీదకు తెస్తానని చెప్పారు.

త్వరలోనే అన్నాడిఎంకెలో ఉన్న ‘స్లీపర్ సెల్స్ తమ వర్గంలోకి వచ్చేస్తాయి’అంటూ ఆయన ప్రకటించారు. పళనిస్వామి సారధ్యంలోని అధికార అన్నాడీఎంకె నిర్వహించిన కీలక సమావేశానికి 21మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైన నేపథ్యంలో దినకరన్ ప్రకటన మరింత రాజకీయ ప్రాధాన్యతకు దారితీసింది. తనకు 21 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని చెప్పిన టీటీవీ త్వరలోనే మరింత మంది బయటకు వస్తారని స్పష్టం చేశారు. పుదుచ్ఛేరి రిసార్టులో ఉన్న ఈ ఎమ్మెల్యేలు అధికారిక సమావేశానికి హాజరుకాకపోవడంతో పళనిస్వామి శిబిరం కంగుతింది.
Tags:    

Similar News