బాబును మరోసారి దెబ్బేసిన ‘23’

Update: 2021-09-20 06:07 GMT
ఏపీలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ తన అధిక్యతను స్పష్టంగా తెలియజెప్పింది. అయితే.. ఈ ఎన్నికల్ని విపక్ష టీడీపీ బహిష్కరించిందని చెబుతున్నా.. పోటీ చేసిన పలు స్థానాల్లో ఓటమి పాలు కావటం ఒక ఎత్తు అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీకి ఎదురైన దారుణ ఓటమి.. ఇప్పుడా పార్టీని నిరాశ ఊబిలోకి నెడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బాబు చేసిన తప్పు ఆయన్ను వెంటాడుతుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నాటి విపక్ష వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో లాగేయటం తెలిసిందే. 2019లో జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమితో పాటు.. టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే రావటంతో.. దేవుడు ఉన్నాడు.. ఆయన చేతలతో చెప్పేశాడన్న మాట భారీ ఎత్తున ప్రచారం జరిగింది.

అప్పటి నుంచి చంద్రబాబుకు ‘23’ ఒక అపశకునంగా మారింది. విచిత్రమైనదేమంటే.. బాబుకు షాకిచ్చే అంశాలన్ని 23 చుట్టూనే తిరుగుతుండటంతో.. ఆ సెంటిమెంట్ కు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పరిషత్ ఎన్నికల్లో వేలాది మంది వైసీపీ నేతలు గెలుపొందినా.. చిత్తూరు జిల్లా టీ సద్దుమూరు ఎంపీటీసీగా విజయం సాధించిన అశ్వినీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీనికి రెండు కారణాలుగా చెప్పొచ్చు. అందులో ఒకటి.. 1989 నుంచి ఆ స్థానాన్ని టీడీపీనే సొంతం చేసుకుంటూ వస్తోంది. ఏ రోజు టీడీపీయేతర పార్టీ తన సత్తాను చాటింది లేదు. అందుకు భిన్నంగా తాజా పరిషత్ ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ అభ్యర్థి విజయం సాధించటంతో అందరూ చూపు ఈ స్థానం మీద పడటంతో పాటు.. ఆశ్వినీ విజయాన్నిప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. మరో ఆసక్తికర కారణం కూడా మిగిలిన వారి విజయాలను ఆశ్విని సాధించిన విజయంతో పోల్చలేని పరిస్థితి.

బాబును అదే పనిగా వెంటాడుతున్న ‘‘23’’ ఆశ్వినీ విషయంలోనూ రిపీట్ అయ్యింది. ఎందుకంటే.. ఆశ్వినీ వయసు ఇప్పుడు ‘23’ కావటమే. బాబుకు వరుస షాకులు ఇచ్చే ‘23’ పరిషత్ ఎన్నికల్లో ఆశ్వినీ రూపంలో ఎదురైందన్న మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడామెను హాట్ టాపిక్ గా మార్చటమే కాదు.. మిగిలిన వారికి భిన్నంగా నిలుపుతోంది. ఆమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చూస్తుంటే.. ‘‘23’’ చంద్రబాబును ఇప్పట్లో వదిలేలా ఉన్నట్లు లేదే? అన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News