భారత్ బంద్: అన్నీ మూత.. రోడ్డు - రైలు రవాణాపై ఎఫెక్ట్

Update: 2021-03-26 05:32 GMT
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతోంది. నాలుగు నెలలుగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ఈ బంద్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు ఇది కొనసాగుతుంది.

భారత్ బంద్ కారణంగా ఇవాళ దేశంలో రైళ్లు, రోడ్లు వ్యవస్థపై ప్రభావం పడింది. ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా శుక్రవారం బంద్ కొనసాగుతోంది. దీనిని ప్రజలే విజయవంతం చేయాలని రైతు సంఘాల సమాఖ్య, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కే.ఎమ్) విజ్ఞప్తి చేశాయి. రోడ్డు - రైలు - రవాణా సేవలను నిలిపివేస్తున్నామని.. మార్కెట్లను స్తంభింపచేస్తామని రైతులు ఇదివరకే ప్రకటించారు.ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

రైతుల నిరసనలను వ్యతిరేకిస్తోన్న ట్రేడర్లు భారత్ కు తమ మద్దతు లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకటన చేశారు. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని ప్రకటించారు.

రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు అన్ని కార్మిక  - విద్యార్థి  - ఉద్యోగ సంఘాలు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భారత్ బంద్ లో వైసీపీ - టీడీపీ - లెప్ట్ పార్టీలు - కాంగ్రెస్ పాల్గొంటున్నాయి.  

విజయవాడలో వామపక్ష నేతలు రోడ్లెక్కారు. బ్యానర్లు, ఫ్లకార్డులు చేతబట్టుకొని భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు - నేతలు బాబూరావు ఇతర నేతలు పాల్గొన్నారు. బస్సులేవీ రోడ్డెక్కలేదు. 
Tags:    

Similar News