వైసీపీలో 27 మంది 32 మంది అయ్యారా?

Update: 2022-12-16 10:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గాల ఇన్‌చార్జులను గడప గడపకు పంపుతున్నారు. ఇందుకోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. సంక్షేమ పథకాల వల్ల ఈ మూడున్నరేళ్లలో కలిగిన లబ్ధిని వారికి వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోమారు గెలిపించాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో సమీక్షించారు. నాలుగు నెలల క్రితం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జనవరి నాటికి పూర్తి కానుంది. ఈ కార్యక్రమం చేపట్టినప్పుడే ఆరు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని జగన్‌ సమయం నిర్దేశించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా తాజాగా ఈ కార్యక్రమ పురోగతిపై జగన్‌ తాజాగా సమీక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా.. నూరు ఆరైనా 175కి 175 సీట్లు సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు 32 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో చురుకుగా లేరని.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సైతం సరిగా నిర్వహించలేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఈ 32 మంది ఎమ్మెల్యేలకు వచ్చే మార్చి వరకు అవకాశం ఇస్తున్నానని.. వారు తమ పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. 175కి 175 సీట్లు సాధించాలన్న తన నిర్ణయంలో మార్పేమీ లేదని వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లను స్వీప్‌ చేయాల్సిందేనని చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్‌ సమీక్ష నిర్వహించినప్పుడు 27 మంది ఎమ్మెల్యేలు సరిగా కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు జగన్‌ ఆగ్రహం నేపథ్యంలో ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయి ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల సంఖ్య 27 నుంచి 32కు పెరగడం విశేషం.

32 మంది ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అంతగా నిర్వహించలేదని.. వీరంతా మరింత బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్‌ సూచించారు. వచ్చే మార్చి నాటికి అందరిపై తాను నివేదికలు తెప్పిస్తానని.. వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని చెప్పినట్టు తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News