సీఎం కేసీఆర్ తో 3 గంటల భేటీ.. ఉండవల్లి చెప్పిందేంటి?

Update: 2022-06-14 04:29 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ మొత్తం జాతీయ రాజకీయాల మీద పెట్టిన సంగతి తెలిసిందే. కేంద్రంలోనిమోడీ సర్కారును టార్గెట్ చేసిన ఆయన.. తనతో కలిసి వచ్చే వారితో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను తాజాగా ప్రగతి భవన్ కు ఆహ్వానించటం తెలిసిందే. వారి భేటీ దాదాపు మూడు గంటల పాటు సాగింది.

సుదీర్ఘ భేటీలోనే లంచ్ పూర్తి చేయించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలు.. వాటి పరిణామాల గురించి మాట్లాడినట్లుగా ఉండవల్లి చెబుతున్నారు. మూడు గంటల పాటు సాగిన భేటీలో కేసీఆర్ పెడుతున్నట్లుగా ప్రచారం సాగుతున్న జాతీయ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క అంశం తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు.అంతేకాదు.. కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు వెళ్లిన తనను మంత్రి హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నట్లు చెప్పారు. తాము చర్చ జరిపినంతసేపు ప్రశాంత్ కిశోర్ అక్కడే ఉన్నారన్నారు.

అయితే.. చర్చలో పీకే పాలు పంచుకోలేదన్నారు. తాము మాట్లాడుకున్న సమయంలో పీకే ఏమీ మాట్లాడలేదన్నారు. మొత్తం మూడు గంటల్లో తాను అరగంట మాట్లాడితే.. సీఎం కేసీఆరే రెండున్నర గంటల పాటు మాట్లాడినట్లుగా చెప్పారు.

ఏపీలో అన్ని పార్టీల కంటే బీజేపీనే బలమైన పార్టీగా చెప్పిన ఉండవల్లి.. ఏపీలోని పాతిక మంది ఎంపీలు ఏ పార్టీ వారైనా సరే.. వారందరిని బీజేపీ ఎంపీలుగానే ఉండవల్లి అభివర్ణించటం విశేషం.

ప్రధానమంత్రి మోడీని వ్యతిరేకించే వారిలో తెలంగాణ సీఎం కేసీఆరే బలమైన నేతగా ఉన్నారన్న ఉండవల్లి.. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని.. ఆ పార్టీ విధానాల్ని మాత్రమే తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.

ఇప్పుడున్నట్లుగా బీజేపీ విధానాలు ఇదే తీరులో పెరిగితే మున్ముందు ప్రమాదమని.. ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్లు వెల్లడించారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే దిశగా కేసీఆర్ సుదీర్ఘ కసరత్తే చేసినట్లుగా కితాబు ఇవ్వటం గమనార్హం. కీలక భేటీకి సంబంధించిన విషయాల్ని పూస గుచ్చినట్లుగా చెప్పిన ఉండవల్లి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News