ఇంత దారుణ‌మా.. ఒకే సిరంజితో 30 మంది విద్యార్థుల‌కు కోవిడ్ టీకా!

Update: 2022-07-28 09:41 GMT
ప్ర‌పంచంలో ఎయిడ్స్ (హెచ్ఐవీ) ప్రారంభ‌మ‌య్యాక ఇంజ‌క్ష‌న్లు, టీకాలు వేసేట‌ప్పుడు ఒక సిరంజీని ఒక‌రికే వినియోగిస్తున్నారు. వాటిని కూడా వేడి నీటిలో ఉంచి.. ఆ త‌ర్వాత మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. అయితే ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థుల‌కు కోవిడ్ టీకా వేసిన వ్యాక్సినేట‌ర్ ఉదంతం మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు అక్క‌డి బీజేపీ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నాయి.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ నగరంలో గల జైన్‌ పబ్లిక్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ఇటీవల విద్యార్థుల‌కు కోవిడ్‌ టీకా పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు టీకాలు వేసేందుకు జితేంద్ర అనే వ్యక్తి వచ్చాడు. ఈ క్ర‌మంలో టీకా తీసుకోవ‌డానికి వ‌చ్చిన విద్యార్థుల‌కు ఒకే సిరంజీని ఉప‌యోగించి 30 మంది విద్యార్థుల‌కు టీకా వేశాడు.

ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థుల‌కు టీకా వేయ‌డాన్ని గ‌మ‌నించిన తల్లిదండ్రులు వ్యాక్సిన్లు వేస్తున్న‌ జితేంద్ర‌ను ప్ర‌శ్నించారు. వ్యాక్సిన్లు తెచ్చిన వ్య‌క్తి ఒకే సిరంజీని ఇచ్చివెళ్లాడ‌ని.. తానేమి చేసేదంటూ నిర్ల‌క్ష్యంగా స‌మాధాన‌మిచ్చాడు. అంతేకాకుండా ఈ విష‌యాన్ని త‌న‌పై అధికారుల‌ దృష్టికి తీసుకెళ్లాన‌ని.. అయితే వాళ్లు కూడా ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేయాల‌ని ఆదేశించార‌ని.. దీంతో తాను ఒకే సిరంజీతో టీకాలు వేశాన‌ని చెప్పాడు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. 2021లో దేశంలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా కేంద్ర ఆరోగ్యశాఖ ఒక‌రికి ఒక సిరంజీ మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని స్ప‌ష్టం చేసింద‌ని త‌ల్లిదండ్రులు వారి దృష్టికి తెచ్చారు. విషయం తెలుసుకుని విద్యార్థుల స్కూలుకు చీఫ్‌ మెడికల్ హెల్త్‌ అధికారి చేరుకున్నారు.

అయితే అప్పటికే జితేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. అతడి ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ అని వస్తోంద‌ని చెబుతున్నారు. దీంతో అధికారులు జితేంద్ర‌పై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా టీకాల పంపిణీకి ఇన్‌ఛార్జ్‌ అయిన జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా. రాకేశ్‌ రోషన్‌పై దీనిపై విచార‌ణ చేప‌ట్టార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోనే కాకుండా వ్యాక్సిన్లు వేసే సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా టీకా పంపిణీలో త‌ప్పులు జ‌రుగుతున్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు వార్త‌లు వ‌చ్చాయి. ఒక టీకా బ‌దులు మ‌రో టీకా ఇవ్వ‌డం, నిర్దేశించిన ప‌రిమితికి మించి ఎక్కువ డోసులు ఇవ్వ‌డం చేస్తున్న ఘ‌ట‌నలో మీడియాలో వ‌చ్చాయి. ఇప్పుడు ఒకే సిరంజీతో 30 మందికి చేసిన ఘ‌ట‌న కూడా హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News