నోట్ల కష్టాలు తీరాలంటే నాలుగు నెలలా..?

Update: 2016-11-14 17:16 GMT
ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు సంచలన నిర్ణయానికి సంబందించి పలు ఆసక్తికరవాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం మాట ఎంత ఉన్నా.. లాజిక్కా ఆలోచిస్తే.. ఒక లెక్క అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దనోట్లను రద్దు చేయటం.. చిల్లర నోట్ల కోసం కష్టాలు తీవ్రతరం కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నోట్ల కష్టాల్ని పరిష్కరించేందుకు తనకు యాభై రోజుల సమయం ఇవ్వాలని.. ఆ తర్వాత ఒక్క దోమను కూడా తాను రాకుండా చేస్తానని ప్రకటించటం తెలిసిందే.

మోడీ చెప్పినట్లుగా యాభై రోజుల్లో నోట్ల కష్టాలు తీర్చటం సాధ్యమయ్యే పని కాదని.. నోట్ల కష్టాల్ని తీర్చటానికి తక్కువలో తక్కువ నాలుగు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. అలా ఎలా అన్న ప్రశ్నకు వారు చెబుతున్న లాజిక్ వింటే నిజమనిపించక మానదు. ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం అక్టోబరు చివరికి నాటికి దేశంలో రూ.17.50లక్షల కోట్ల నోట్లుచెలామణీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందులో84 శాతం అంటే రూ.14.50లక్షల కోట్ల నగదు రూ.500.. రూ.1000 నోట్లే. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోడీ పేర్కొన్న నేపథ్యంలో కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చేప్రయత్నం చేస్తున్నారు. ఇందలో భాగంగా నవంబరు 10 నుంచి 13 వరకు అంటే.. నాలుగురోజుల వ్యవధిలో పంపిణీ చేసిన మొత్తం రూ.50వేల కోట్లు మాత్రమే.

నోట్లు మార్పిడి చేసుకున్న ప్రజలకు రూ.100.. రూ.2వేల నోట్లను అందించారు. ఇదిలా ఉంటే.. నోట్ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల ముందు.. ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. రోజుల తరబడి క్యూలలో నిలుచోవటంపై వారు విసుగు చెందుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తానికి సంబంధించిన మొత్తాన్ని ముద్రించటంతో పాటు.. గతంలో చెలామణిలో ఉన్న నగదు.. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తాన్ని తీసేస్తే.. మిగిలిన మొత్తాన్ని లెక్కించి కొత్తగా ముద్రించి ప్రభుత్వ ఖాతా కింద ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరగటానికి ఎంత లేదన్నా 116 రోజులు పడుతుందని.. మొత్తంగా నాలుగు నెలల సమయం ఖాయమని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం మోడీ సర్కారుకు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News