మంత్రులా... మజాకానా?

Update: 2015-07-02 09:13 GMT
    అధికారం చేతిలో ఉంటే విమానాన్ని కూడా సిటీబస్సులా మార్చేస్తారు.. తాము వచ్చేవరకు ఆపమని చెబుతారు... వందలాది మంది ప్రయాణికులను వెయిట్ చేయిస్తూ షాపింగులకూ వెళ్తారు... సీటు దొరక్కపోతే ఆల్రెడీ టిక్కెటు తీసుకున్నవారిని కిందకు దించేస్తారు. హోదా... అధికారం ఉంటే ఇలాంటివి ఎన్నయినా చేస్తారు.. తాజాగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఇదే పనిచేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు కోసం ఎయిర్ ఇండియా సిబ్బంది గంటపాటు విమానాన్ని నిలిపివేశారు. కేంద్రమంత్రి కోసం విమానం నుంచి ముగ్గురు ప్రయాణికులను ఎయిర్ ఇండియా సిబ్బంది విమానంలో నుంచి దింపేశారు. దీంతో కేంద్రమంత్రి, ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు. వారం కిందట జరిగిన ఈ సంఘటన లేటెస్టుగా బయటపడింది.

గత నెల 24న హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ కుమార్ సింగ్ లు ఢిల్లీ వచ్చేందుకు లేహ్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే.. ముందస్తు ప్రణాళిక లేకుండా వారు బయలుదేరడంతో వారికి విమానంలో సీట్లు దొరకలేదు. కానీ వస్తున్నది మంత్రులు కావడంతో ఎయిర్ ఇండియా అతి చేసింది. అప్పటికే ఆ విమానంలో ఉన్న ముగ్గురిని దించేసింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానం నుంచి తమను దిగమనడంతో వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే... మంత్రుల కోసం ఈ పనిచేసినట్లు తెలవడంతో వారు అప్పటికి ఏమీ అనలేకపోయినా తరువాత విషయం మీడియాకు చేరవేసేసరికి గుట్టు బయటపడింది. దించేసిన ప్రయాణికుల్లో ఎయిర్ ఫోర్సుకు చెందిన అధికారి కూడా ఒకరున్నారు.  

అయితే... కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాత్రం ప్రయాణికులను దించేసిన సంగతి తమకు తెలియదని... ఆ తప్పు ఎయిరిండియాదేనని తప్పుకొన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి షాపింగ్ చేస్తూ విమానం ఆలస్యానికి కారణమయ్యారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలసిందే. మొత్తానికి రాజకీయ నాయకులు సాధారణ ప్రజలతో ఆడుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News