స్కామా? లూటీనా? తెలుగు అకాడ‌మీలో 43 కోట్ల గ‌ల్లంతు?

Update: 2021-09-29 14:30 GMT
తెలుగు అకాడ‌మీ!  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌త్యేక గుర్తింపు పొందిన సంస్థ‌. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. పెద్ద‌గా గుర్తింపు లేకుండా పోయిన సంస్థ కూడా. దీనిని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విభ‌జించుకున్నా.. ఆస్తుల‌ను ఇంకా పంచుకోవాల్సి ఉంది., అయితే.. ఇప్పుడు ఈ అకాడ‌మీకి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌లో 43 కోట్ల రూపాయ‌లు గ‌ల్లంత‌వడం.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. మ‌రి ఇది కుంభ‌కోణ‌మా.. లేక‌.. లూటీనా? అనే చ‌ర్చ సాగుతోంది.

వాస్త‌వానికి ఏపీకి సంబంధించి.. తెలుగు అకాడ‌మీ వాటా కింద రావాల్సిన నిధులు అంద‌లేదు. దీంతో ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. ఈ క్ర‌మంలో ఈనెల 15న తీర్పు వెలువ‌రించిన సుప్రీం కోర్టు ఈ విష‌యాన్ని చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని.. తెలంగాణ నిధులు ఇచ్చి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. మూడు మాసాల్లో ఈ వివాదాన్ని తేల్చుకోవాల‌ని తేల్చి చెప్పింది. ఒక‌వేళ అప్ప‌టికీ.. స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే.. తాము జోక్యం చేసుకుంటామ‌ని తెలిపింది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు.. స్థిర‌, చ‌రాస్తులు, ఫిక్స్ డ్ డిపాజిట్లపై మ‌దింపు ప్రారంభ‌మైంది. అయితే.. ఇంత‌లోనే అకాడ‌మీకి చెందిన 43 కోట్ల రూపాయ‌ల ఫిక్స్ డ్ డిపాజిట్ల సొమ్ము.. గ‌ల్లంతు కావ‌డం.. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. వాస్త‌వానికి తెలుగు అకాడ‌మీ నిధులు.. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. అయితే.. తాజా సుప్రీం తీర్పుతో అకాడ‌మీ ప్ర‌తినిధులు... బ్యాంకుకు వెళ్లి ప‌రిశీలించ‌గా.. నిధుల గ‌ల్లంతు వ్య‌వ‌హారం వెలుగు చూసింది.

వెంట‌నే తెలుగు అకాడ‌మీ ప్ర‌తినిధులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలొకి దిగిన పోలీసు లు.. యూనియ‌న్ బ్యాంక్ అధికారుల‌ను ప్ర‌శ్నించ‌గా.. తాము అకాడ‌మీ ప్ర‌తినిధుల‌కు నిధుల‌ను అప్ప‌గిం చిన‌ట్టు చెప్పారు. దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

``గ‌త ఏడాది డిసెంబ‌రు నుంచి ఈ ఏడాది జూలై వ‌ర‌కు.. అకాడమీ అధికారులు రూ.43 కోట్లను వాయిదాల ప‌ద్ధ‌తిలో డిపాజిట్ చేశారు. గ‌త ఆగ‌స్టులో 11.37 కోట్ల‌ను, త‌ర్వాత 5.70 కోట్ల‌ను విత్‌డ్రా చేశారు. దీనిని కోప‌రేటివ్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే. అదేస‌మ‌యంలో కొంత మొత్తాన్ని ఎస్‌బీఐలోనూ డిపాజిట్ చేసిన‌ట్టు తెలిసింది. అనంత‌ర కాలంలో.. 26 కోట్ల‌ను అకాడ‌మీ అధికారులు విత్ డ్రా చేశారు., మేం బ్యాంకు రికార్డుల‌ను ప‌రిశీలించాం. న‌గ‌దును అప్ప‌గించాం`` అని బ్యాంకు అధికారులు పోలీసుల‌కు తెలిపిన‌ట్టు తెలిసింది.

అయితే.. ఈ క్ర‌మంలో న‌కిలీ డాక్యుమెంట్లు స‌మ‌ర్పించి.. బ్యాంకు అధికారుల‌ను బురిడీ కొట్టించి న‌గదు ప‌ట్టుకెళ్లార‌ని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. బ్యాంకు అధికారులు మాత్రం తాము రికార్డులను స‌రిచూసే ఇచ్చామ‌ని చెబుతున్నారు. కానీ, తీసుకువెళ్లిన వారి గుర్తులే లేవ‌ని.. చెప్పారు. దీంతో ఈ ఘ‌ట‌న పెద్ద అంతుచిక్క‌ని విష‌యంగా మారిపోయింది. మ‌రి.. ఇది లూటీనా.. లేక‌.. పెద్ద స్కామా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండడం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News