శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఎటీఎంలో వందకు 500

Update: 2016-12-25 06:04 GMT
నిజంగా నిజం. నిజానికి ఈ నిజాన్ని చాలామంది తమకు తాము అనుభవంలోకి వచ్చిన తర్వాత కానీ నమ్మలేదు. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని.. ఏటీఎంలలో డబ్బులు రావటం మానేసి చాలా కాలమే అయ్యింది. నవంబరు 8కి ముందు వరకూ ఎటీఎం అన్న వెంటనే.. ఎనీటైం మనీ అన్న పేరు స్థానే.. ఎనీ టైం మూసివేయటంగా జనాలు జోకులేసుకునే పరిస్థితి.

ఇలాంటి వేళ.. ఏటీఎం పని చేయటమే గొప్ప విషయం అయితే.. ఇక.. వంద రూపాయిలు రావాల్సిన స్థానే రూ.500 నోట్లు రావటం సంచలనంగా మారింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని కొటక్ మహింద్రా బ్యాంకు సంబంధించిన ఏటీఎం మిషన్ ఒకటి ఉంది. ఇందులో డబ్బులు విత్ డ్రా చేసుకోవటానికి వినియోగదారుడు ఒకరు వెళ్లారు. రూ.2500డ్రా చేసుకునే ప్రయత్నం చేయగా.. ఒక రెండు వేల నోటు.. మిగిలిన ఐదు వందల నోట్లు రావాల్సి ఉండగా.. ఐదు రూ.500నోట్లు వచ్చాయి. అంటే..  వంద రూపాయిల నోటు స్థానే రూ.500 నోటు వచ్చిందన్న మాట. ఇది ఆశ్చర్యకరంగా మారటమే కాదు.. క్షణాల్లోనే ఈ విషయం బయటకు పొక్కింది. అంతే.. ఈ ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవటానికి జనాలు పోటీ పడ్డారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు.. ఏటీఎం మెషిన్ ను ఆపివేయించారు. అనంతరం ఈ విషయాన్ని బ్యాంకుకు తెలియజేశారు. నోట్లను ఫీడ్ చేసిన సమయంలో దొర్లిన తప్పు కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News