పెన్సిల్.. ఎరేజర్ ధరల మంటపై మోడీకి లేఖ రాసిన ఒకటో క్లాస్ బాలిక

Update: 2022-08-01 04:25 GMT
ధరలు మండుతున్నాయి. ఉప్పు.. పప్పులు మాత్రమే కాదు పాలు.. పెరుగు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరాఘాతం మంట పుట్టేలా మారింది. ఒకే దేశం ఒక పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీని తెగ బాదేస్తున్న మోడీ సర్కారు తీరుపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైనం తెలిసిందే.

ఇటీవల పాలు.. పెరుగు..పాల ఉత్పత్తుల్ని సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం.. పలు నిత్యవసర వస్తువుల్ని ప్యాకేజ్ చేస్తే పన్ను పరిధిలోకి తీసుకురావటంపై పలువురు మండిపడుతున్న వైనం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఎవరూ చేయని పనిని చేసింది యూపీకి చెందిన ఒకటో తరగతి చదివే పాప.

తాను పెన్సిల్ పోగొట్టినందుకు తన తల్లి మందలించినట్లుగా ఆ పాప వాపోయింది. తాను పెన్సిల్ పోగొట్టుకోవటం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ పలుమార్లు తాను పెన్సిల్ పోగొట్టుకున్నా తన తల్లి ఏమనేది కాదని.. ఇప్పుడు మాత్రం తిట్టటంతో ఆలోచనలో పడింది. తన తల్లి ఆగ్రహానికి కారణం ధరల మంట కూడా అన్న విషయాన్ని గుర్తించిన ఆమె.. హిందీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేరుగా లేఖ రాసింది.

తన పేరు కృతీ దూబేనని.. తాను ఒకటో తరగతి చదువుతున్నట్లుగా పేర్కొంది. తాను యూపీలోని కనౌజ్ జిల్లా చిబ్రమౌ పట్టణంలో ఉంటానని పేర్కొన్న ఆ పాప హిందీలో మోడీకి లేఖ రాసింది. పెన్సిల్ పోగొట్టుకున్న విషయాన్ని ఈసారి తన తల్లి చాలా సీరియస్ గా తీసుకుందని.. తనను గట్టిగా మందలించినట్లుగా వాపోయింది.

'మీరు ధరల్ని బాగా పెంచుతున్నారు. పెన్సిల్.. ఎరేజర్ కాస్ట్ లీ అయ్యాయి. వీటిని పోగొట్టుకుంటుంటే అమ్మ తిడుతోంది. కొడుతోంది. పెన్సిల్.. ఎరేజర్ రేప్పొద్దు క్లాస్ లో ఎవరైనా దొంగలిస్తే ఏం చేయను? మ్యాగీ ధర కూడా బాగా పెరిగింది' అంటూ పేర్కొన్న లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల కాలంలో నిత్యవసర వస్తువుల నుంచి అన్ని వస్తుసేవల ధరలు భారీగా పెరిగిపోవటం తెలిసిందే. దీనికి తోడు ఇప్పటి వరకు జీఎస్టీ జాబితాలో లేని వస్తువుల్ని.. వస్తుసేవల్ని పన్ను పరిధిలోకి తీసుకురావటంతో ఆయా వస్తువుల ధరలు మండుతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో ఈ ధరల పెంపు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటివేళ తనకు ఎదురైన కష్టంపై ప్రధాని మోడీకి లేఖ రాసిన లేఖతో ఆరేళ్ల కృతీ దూబే ఆవేదనతో అందరూ కనెక్టు అయ్యేలా చేసింది. అదే.. వైరల్ కావటానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
Tags:    

Similar News