హైదరాబాద్ లో 6.6లక్షల మందికి కరోనా? అదెలానంటే?

Update: 2020-08-20 04:30 GMT
తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీదే నమోదైన కరోనా కేసులే రెండు లక్షలు దాటింది లేదు అలాంటిది.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 6.6లక్షల కరోనా కేసులు ఎలా చెబుతారు? అసలు మీకేమైంది? అన్న ఆగ్రహం అక్కర్లేదు. ఎందుకంటే.. తాజాగా జరిపిన అధ్యయనం ఒకటి షాకింగ్ నిజాల్ని బయటపెట్టింది.

పరీక్ష చేసి.. లక్షణాలు బయటపడితేనే కరోనా వచ్చినట్లు కాదు కదా? వైరస్ వచ్చి పోయినా కూడా అది లెక్కే కదా? మరి.. అలాంటి లెక్క ఎలాసాధ్యమవుతుంది? అన్న ప్రశ్నలకు హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ సింఫుల్ గా చెప్పాలంటే అందరికి సుపరిచితమైన (సీసీఎంబీ) సంస్థ తాజాగా జరిపిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మురుగునీటి శాంపిళ్లను సేకరించి.. వాటి ఆధారంగా తాజాగా వేసిన లెక్క ఒకటి వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వచ్చిపోయిన వారు దాదాపు 6.6 లక్షల మంది వరకు ఉండొచ్చన్న విషయాన్ని సీసీఎంబీ తాజాగా వెల్లడించింది. ఇదంతా చూసినప్పుడు.. అధికారికంగా నమోదైన కేసుల సంఖ్య కంటే అధ్యయనంలో తేలిన కేసుల సంఖ్య దాదాపు 24 రెట్లు అధికంగా ఉండటం విశేషం.

ఇంతకీ సీసీఎంబీ చేసిన అధ్యయనం ఏమిటి? కరోనా వ్యాప్తి గ్రేటర్ పరిధిలో ఎలా సాగిందన్న విషయాన్ని తేల్చేందుకు వారో ఆసక్తికరమైన ప్రయోగాన్ని చేపట్టారు. శాస్త్ర పరంగా చూస్తే.. కోవిడ్ 19కు కారణమైన వైరస్ అవశేషాలు మానవ మలంలో 35 రోజుల దాకా ఉంటాయి. ఇవి మరుగుదొడ్ల పైపుల నుంచి ప్రవహించి.. మునిసిపల్ మురుగునీటి పైపుల్లో కలుస్తాయి.

ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమంటే.. ఒక వ్యక్తిలో కరోనా కనిపించినా.. కనిపించకున్నా.. వైరస్ సోకి వారికే తెలీక తగ్గిపోయిన వారి మలంలోనూ ఇలాంటి అవశేషాలు కనిపిస్తాయి. అయితే.. అవి ఎలాంటి శక్తి లేకుండా నిర్వీర్యమైపోతాయన్నది మర్చిపోకూడదు. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ముప్పు ఉండదు. ఈ అవశేషాలు 35 రోజలు వరకు ఉంటాయి.

హైదరాబాద్ మహానగరంలో రోజుకు 1800 మిలియన్ లీటర్ల మురుగునీటి వ్యర్థాలు వస్తుంటాయి. వాటిల్లో 40 శాతం మేర పలు మురుగునీటి శుద్ధి కేంద్రాలకు వస్తాయి. మురుగును అక్కడ శుద్ధి చేస్తారు. సీసీఎంబీ పరిశోధకులు జులై 8నుంచి ఆగస్టు ఆరువరకు ఆయా మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి నాలుగు సార్లు నమూనాల్ని సేకరించారు. వాటిల్లో కరోనా ఆర్ ఎన్ ఏ అవశేషాల కోసం పరీక్షలు జరిపారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు సేకరించిన శాంపిళ్లు నగరంలో విడుదలయ్యే మొత్తం మురుగునీటిలో 40 శాతం మాత్రమే.

వీరి అధ్యయనం ప్రకారం 2.2 లక్షల మందికి కరోనా సోకి ఉండొచ్చని అంచనా వేశారు. తాము సేకరించిన 40 శాతం మురుగునీటి శాంపిల్ లో ఇంత మంది అయినప్పుడు.. మొత్తం వందశాతం మురుగునీటిని పరిగణలోకి తీసుకుంటే.. హైదరాబాద్ లో ఏకంగా 6.6లక్షల మందికి కరోనా వచ్చి పోయి ఉండొచ్చన్నది తాజా విశ్లేషణ. మరిన్ని కేసులు వచ్చినప్పుడు అవి ఎందుకు బయటకు వెలుగు చూడలేదంటే.. దానికి కారణంగా కరోనాయాంటీ బాడీలు ఎక్కువగా ఉన్నప్పుడు.. వాటి ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. దీంతో.. ఆసుపత్రుల మీద భారీ ఒత్తిడి పడలేదు. ఈ అధ్యయనాన్ని చూసినప్పుడు.. కరోనా వాస్తవ కేసులతో పోలిస్తే.. లక్షణాలు బయటపడి.. నిర్దారణ అయిన వారు చాలా తక్కువమంది అని చెప్పొచ్చు.
Tags:    

Similar News