అరుణాచల్ ప్రదేశ్ ను చూసైనా మనం సిగ్గుపడాలి

Update: 2017-06-10 06:09 GMT
తెలుగు రాష్ర్టాల్లో ట్రావెల్ బస్సులు అంటే వారు ఆడింది ఆట పాడింది పాట. కానీ... ఆ ఆటాపాట మా దగ్గర సాగదని చెప్పింది అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంటు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ తో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ కు చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను అరుణాచల్‌ ప్రదేశ్‌ రవాణాశాఖ రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించాయంటూ 900 బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించకుండా బస్సులకు రిజిస్ట్రేషన్‌ చేసిన ముగ్గురు అధికారులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

పర్యాటక రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ లో 2+ 1 విధానంతో స్లీపర్‌ సీట్లు ఏర్పాటు చేసుకునే అవకాశంతో పాటు కేవలం 15,000 రూపాయల పర్మిట్‌ పన్ను మాత్రమే ఉండడంతో ఏపీ - తెలంగాణకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు తమ బస్సులను అక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను దోచుకుంటున్నారు. అయితే, నిబంధనల మేరకు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి బస్సు నెలకు ఒకసారైనా అక్కడికి వెళ్లిరావాల్సి ఉంటుంది.  కానీ, అక్కడ రిజిష్టర్ చేయించుకున్న తెలుగు రాష్ర్టాల బస్సులు ఆ తరువాత ఒక్కసారి కూడా ఆ రాష్ర్టం ముఖం చూడడం లేదు.  తెలుగు రాష్ట్రాల్లో ట్రిప్పులేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నాయి.
    
దీనిపై ఏపీ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు అరుణాచల్ ప్రదేశ్ రవాణాశాఖ మంత్రికి ఫిర్యాదు చేయగా, దానిని నిర్ధారించుకున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ భేటీలో సుమారు 1000 బస్సుల పర్మిట్ లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీఏ ఆఫీసులకు ఆదేశాలు పంపింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ షాక్ తిన్నాయి. ఈ నేపథ్యంలో, త్వరలోనే ఏపీ - తెలంగాణల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని నడుపుతామని ట్రావెల్స్ యజమానులు చెబుతున్నారు.
    
ఇదంతా ఎలా ఉన్నా ట్రావెల్స్ యాజమాన్యాల లాబీయింగ్ కు ప్రభుత్వాలే తలొగ్గుతుండడంతో ఇక్కడ వారికి అడ్డే ఉండడం లేదు. దాంతో వారు నచ్చిన రేట్లతో దోచుకుంటున్నారు. విపరీతమైన వేగంతో ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. అయినా, ప్రభుత్వాలు ఏమీ చేయడంలేదు. అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం చూసైనా మన ప్రభుత్వాలు సిగ్గుపడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News