తాగి.. కేసీఆర్ మేనల్లుడ్ని అంటే పోలీసులు వణుకుతారా?

Update: 2016-06-13 09:24 GMT
పూటుగా తాగేసి.. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లేసి.. ఏం రా.. మీ కానిస్టేబుల్ ఎక్కువ చేస్తున్నాడు. నేనెవరినో తెలుసా? సీఎం కేసీఆర్ మేనల్లుడ్ని. నాతోనే ఇలా వ్యవహరిస్తారా? అంటూ రంకెలు వేస్తే ఏం చేస్తారు? ముందు.. రెండు పీకి.. తర్వాత వైద్య పరీక్షలకు పంపుతారా? ప్రశ్న వేస్తే ఇలాంటి సమాధానాలు చెబుతారు కానీ.. రియల్ గా ఇలాంటి పరిస్థితే ఏం జరిగిందో తెలియాలంటే సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో తాజాగా చోటు చేసుకున్న ఘటన గురించి తెలుసుకుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే.

ఆదివారం రాత్రివేళ.. సిద్దిపేట శివారులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు ఓ వ్యక్తి పూటుగా తాగి వచ్చాడు. స్టేషన్ ఎదుట బైక్ ఆపాడు. అతని తీరును అభ్యంతరం వ్యక్తం చేసిన ఆక్కడి పోలీస్ కానిస్టేబుల్.. బండి పక్కకు పెట్టాలని చెప్పాడు. అంతే.. సదరు వ్యక్తి కి ఒక్కసారి కోపం వచ్చేసింది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టటమే కాదు.. ‘‘నేనెవర్ని అనుకున్నావ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడ్ని. నాకే ఎదురు సమాధానం చెబుతావా?’’ అంటూ చెలరేగిపోయాడు. పక్కనున్న కానిస్టేబుల్ సర్ది చెప్పబోయే లోపు.. బండి దిగి.. స్టేషన్ లోపలకు వెళ్లాడు.

అక్కడున్న ఎస్ ఐ బుచ్చయ్య.. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మీద విరుచుకుపడ్డారు. ‘‘ఏం రా.. సీఎం కేసీఆర్ మేనల్లుడ్ని నన్నే ప్రశ్నిస్తార్రా? మీరెంత.. మీ బతుకెంత? 44 శాతం జీతాలుతీసుకుంటున్నారు...’’ అంటూ రాయలేని రీతిలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. ఇతగాడి ఫైరింగ్ రేంజ్ కి.. పోలీస్ స్టేషన్లోని వారి నోటి వెంట మాట రాని పరిస్థితి. లోపల సందేహం పీకుతున్నా.. తొందరపడలేని పరిస్థితి. కొంపదీసి తాగి వచ్చినోడు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడైతే? అన్న సందేహం వారిని నోరు విప్పకుండా చేసింది.

ఇంతలో ఈ రచ్చ గురించి తెలిసిన స్థానిక మీడియా వారు స్టేషన్ కు రావటం.. తప్పతాగి హడావుడి చేస్తున్న వ్యక్తి సిద్దిపేట హెడ్ పోస్టాపీసులో ఏపీఎం కొండల్ రావుగా గుర్తించి.. పోలీసులకు ఆ వివరాలు చెప్పారు. అప్పటికి అలెర్ట్ అయిన పోలీసులు.. తమదైన శైలిలో అయ్యగారిని సత్కరించి.. పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. ఇక్కడ అందరికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి మేనల్లుడంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. కేసీఆర్ మాట విన్నంతనే నోటి వెంట మాట రాన్నట్లుగా వ్యవహరించటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డూపుగాడికే ఇంతగా కామ్ అయినోళ్లు.. నిజమైన మేనల్లుడు కానీ స్టేషన్ కి వస్తే మరెంత వినయ విధేయతల్ని ప్రదర్శిస్తారో..?
Tags:    

Similar News