ఆకుకూరగా భావించి గంజాయి ఆకు తిని ఆరుగురికి ఆస్పత్రిపాలు!

Update: 2020-07-01 23:30 GMT
ఆకుకూరగా భావించి గంజాయి ఆకులు తిని ఓ కుటుంబమంతా అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అది ఆకుకూర అని బావమరిదికి ఓ బావ ఇచ్చాడు. అది వండుకుని తిన్న ఆ కుటుంబమంతా ప్రాణాలతో పోరాడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా మియాగంజ్ గ్రామానికి చెందిన ఓం ప్ర‌కాశ్ గంజాయి ఆకుని మెంతికూరగా చెప్పి తన బావ మరిది నితేశ్ కి ఇచ్చాడు. ఈ విషయం తెలియని నితేశ్ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వండాలని చెప్పాడు. కూర వండాక ఇంట్లో వారంతా కలిసి తిన్నారు. తిన్న కొంతసేపటికి వారికి మత్తు ఎక్కింది. ఒక్కొక్క‌రుగా స్పృహ‌త‌ప్పి ప‌డిపోయారు. ఈ విషయం తెలిసిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గంజాయి ఇచ్చిన బావ ఓం ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇంట్లో ఉన్న వండిన గంజాయి కూరతో పాటు ఆ పక్కనే ఉన్న గంజాయి ఆకులను. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి అవి గంజాయి ఆకులు అని పోలీసులు నిర్ధారించారు. ఓం ప్రకాశ్ గంజాయి సరఫరా చేస్తుంటాడా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆ ఆకులు అతడికి కూరగాయలు అమ్మే వ్యక్తి ఇచ్చాడని తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags:    

Similar News