ఉల్లిపాయల్ని చూసి వణికిపోతున్న అమెరికన్లు

Update: 2020-08-07 02:30 GMT
ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాకు.. ఆ దేశంలోని అమెరికన్లకు ఈ మధ్యన టైం ఏ మాత్రం బాగోవటం లేదు. ప్రపంచం ఎలా పోయినా.. ఎలాంటి నొప్పిని ఫీల్ కాని దేశాల్లో అగ్రరాజ్యం ముందుండేది. అలాంటి అమెరికాలో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కరోనా చేస్తున్న కరాళ నృత్యానికి కిందామీదా పడిపోతున్నారు. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా కరోనా పాజిటివ్ కేసులునమోదు కావటమే కాదు.. మరణాలు సైతం భారీగా చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇవాల్టికి యాభై లక్షల కేసులు ఇప్పటివరకూ నమోదు కాగా.. 1.6లక్షల మంది ఇప్పటివరకు మాయదారి మహమ్మారి కారణంగా మరణించారు. మరే ఉత్పాతంలోనూ అమెరికన్లు ఈ స్థాయిలో మరణించింది లేదు. కనుచూపు మేర కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేకపోవటంతో.. మరింత మంది బాధితులు.. మరణాలు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. గతంలో ఎప్పుడూ లేనంత భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా మరో కొత్త కష్టం అమెరికన్ల మీద పడింది. వారు నిత్యం వినియోగించే ఉల్లి ఇప్పుడు వారి పాలిట శాపంగా మారిందంటున్నారు. ఉల్లి మాట ఎత్తితేనే వారు వణికిపోతున్నారు. దీనికి కారణం ఆ దేశానికి వచ్చిన ఉల్లిలో ఒక భయంకరమైన వ్యాధి ఉందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ కూడా అధికారికంగా వెల్లడించింది.

కొద్ది రోజులుగా అమెరికా.. కెనడాలోని సాల్మొనెల్లా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పటివరకూ ఈ వ్యాధి దగ్గర దగ్గర 34 రాష్ట్రాలకు వ్యాపించిందని.. దీని బారిన పడినోళ్లు 400 మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. సాల్మొనెల్లా పొట్టలోని పేగుల మీద ప్రభావం చూపించటం.. విపరీతమైన కడుపు నొప్పి.. విరేచనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. ఈ బ్యాక్టిరీయా సోకిన వారికి ఆరు గంటల పాటు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో తెలిసి వస్తుందని చెబుతున్నారు.

ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవని.. 8 నుంచి 72 గంటల తర్వాత మొదలవుతాయని చెబుతున్నారు. అప్పటి నుంచి ఎనిమిది గంటల పాటు రోగ తీవ్రత ఎక్కువని చెబుతున్నారు. మొత్తంగా నాలుగు నుంచి ఏడు రోజుల పాటు లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. పెద్ద వయస్కులు మందులు వాడితే సరిపోతుంది కానీ.. పిల్లలు.. పెద్దవయస్కులకు మాత్రం ఈ బ్యాక్టీరియా పట్టుకుంటే మాత్రం.. తప్పనిసరిగా వైద్యుడి వద్దకు వెళ్లటం మంచిదని చెబుతున్నారు.

ఇంతకీ ఎందుకిలా అన్నది ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేశారు వివిధ శాఖలకు చెందిన అధికారులు. చివరకు తేల్చిందేమంటే.. అమెరికా.. కెనడాకు నౌకల్లో వచ్చిన ఉల్లిలో (మనకు మాదిరి ఎర్ర ఉల్లిపాయలే కాదు.. తెలుపు.. పసుపు రంగుల్లో ఉల్లి దొరుకుతుంది) ఎలా వచ్చి చేరిందో కానీ.. ఈ దరిద్రపుగొట్టు బ్యాక్టీరియా వచ్చి చేరిందట. దీంతో.. ఉల్లిని తింటే చాలు.. చుక్కలు కనిపిస్తున్నాయట. అందుకే.. ఉల్లి మాట ఎత్తితే చాలు అమెరికన్లు వణికిపోతున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా పరిశీలించిన అధికారులు థాంప్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చిన అన్ని రకాల ఉల్లిపాయల్లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లుగా తేల్చారు. దీంతో. ఆ సంస్థకు చెందిన ఏ రకం ఉల్లిని కూడా కొనొద్దని చెబుతున్నారు.
Tags:    

Similar News