సంచలన చార్జిషీట్: రాజీవ్ లాగానే మోడీ హత్యకు కుట్ర

Update: 2019-12-20 07:19 GMT
మహారాష్ట్ర లో నమోదైన ఎల్గార్ పరిషత్ కేసు చార్జిషీట్ లో సంచలన నిజాలను పోలీసులు పొందుపరిచారు. ఈ కేసులో దేశంలోనే ప్రముఖులైన 9మంది హక్కుల నేతలపై కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే..

తాజాగా పోలీసులు చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హత్య కు మావోయిస్టులు కుట్ర పన్నారని.. మావోయిస్టు సానుభూతిపరులైన హక్కుల నేతలకు ఈ కుట్రలో భాగం ఉందని పుణెలోని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) శుక్రవారం ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.  రాజీవ్ గాంధీని శ్రీపెరంబదూర్ లో హత్య చేసినట్టే రోడ్ షోలో మోడీని కడతేర్చాలని కుట్ర పన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకోసం 8 కోట్ల నగదు, ఓ అత్యాధునిక ఎం4 రైఫిల్, 4 లక్షల రౌండ్ల మందుగుండు, మరణాయుధాలను ఓ సప్లయిర్ నేపాల్, మణిపూర్ మీదుగా తీసుకురావడానికి ప్రయత్నించారని చార్జిషీట్ ముసాయిదాలో ఆరోపించారు.

ఈ హక్కుల నేతల్లో తెలుగు విప్లవ రచయిత అయిన వరవరరావుతోపాటు సుధీర్ ధవాళే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గోంసాల్వెస్, సుధ భరద్వాజ్  అనే హక్కుల నేతలు ఉన్నారు.

2017 డిసెంబర్ 31న భీమా కోరెగాం ప్రాంతంలో ఎల్గార్ పరిషత్ సమావేశం నిర్వహించారు. ఇది మావోయిస్టులు ఏర్పాటు చేసినదేనని పోలీసులు ఆరోపించారు. దీని అనంతరం బీమా కోరెగాం సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు సాగడం.. హింస చెలరేగడం.. రాజకీయ దుమారం రేగడంతో దీని వెనుక హక్కుల నేతలే కారణమని పోలీసులు వారిని నిర్భంధించారు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత వారిపై చార్జిషీటు దాఖలు చేశారు.ఈ పరిణామంతో తెలుగు విప్లవ రచయిత వరవరరావుతోపాటు మిగతా హక్కుల నేతలు కేసులో చిక్కుకున్నారు.


Tags:    

Similar News