వైసీపీ టీడీపీలను అతలాకుతలం చేస్తున్న ఓ సర్వే...?

Update: 2022-09-02 14:30 GMT
సర్వేలు ఇపుడు ముందుకు వచ్చేస్తున్నాయి. ఒక విధంగా చూస్తే ఎన్నికల జ్వరం సర్వేశ్వరులకే పట్టుకుంది అంటున్నారు. ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే సర్వేల పేరిట వదులుతున్న నివేదికలు ప్రధాన పార్టీలలో అలజడి రేపుతున్నాయి. వాటిలో నిజమెంత ఉందో తెలియదు కానీ జనాల్లో చర్చకు వస్తూండడంతో దాని వల్ల తమకు ఏమైనా డ్యామేజ్ కలుగుతుందా అన్న బెంగ పార్టీ పెద్దలదిగా ఉంటోంది.

ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో వచ్చిన సర్వేలు ఏపీలో వైసీపీ ముందంజలో ఉందని తేటతెల్లం చేశాయి. ఇక జిల్లాల వారీగా కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఈ రోజుకు ఎన్నికలు పెడితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇలా ఉంటుంది, అక్కడ టీడీపీకి ఈ చాన్స్ ఉంటుంది అంటూ చేస్తున్న సర్వేలతో పార్టీల రాజకీయం వేడెక్కుతోంది. అలాంటి ఒక సర్వే శ్రీకాకుళం జిల్లాలో  ఇపుడు హాట్ హాట్ టాపిక్ గా ఉంది. పీపుల్స్ పల్స్ అంటూ తాజాగా  వచ్చిన ఒక సర్వే శ్రీకాకుళం జిల్లాలో ఇపుడు సంచలనంగా ఉంది.

ఈ సర్వే ప్రకారం చూస్తే అధికార పార్టీకి కాస్తా గుండె దడనే తెచ్చిపెడుతోంది అంటున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ సీట్లలో అంచనా తీసుకుంటే వైసీపీకి 44.50 శాతం జనాలు జై కొట్టారని, అదే టీడీపీకి 42.35 శాతం జనలా మద్దతు ఉందని, ఇక జనసేనకు 6.75 శాతం జనాల ఆదరణ ఉందని సర్వే తేల్చింది. అంటే విడిగా పోటీ చేస్తే ఎడ్జ్ లో వైసీపీ ఉంటుందని విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని లెక్క తేల్చింది అన్న మాట.

అదే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే కచ్చితంగా 48 శాతానికి పైగా ఓట్ల షేర్ ని దక్కించుకుని విజయఢంకా మోగిస్తాయని కూడా ఈ సర్వే చెబుతోంది. ఇక బీజేపీకి ఈ జిల్లాలో 1.85 శాతం ఓట్ల షేర్ ఉందని అంటున్నారు. అంటే ఆ మూడు పార్టీలు కలిస్తే యాభై శాతం ఓట్లను పట్టుకుపోతారని సర్వే చెబుతోంది అంటున్నారు.

ఇక అసెంబ్లీ సీట్ల వారీగా చూస్తే ఎచ్చెర్ల, పాతపట్నం, టెక్కలి. నరసన్నపేటలలో వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాని సర్వే చెబుతోంది. అంటే మొత్తం ఎనిమిది సీట్లలో నాలుగు టఫ్ ఫైట్ మధ్య నువ్వా నేనా అని అంటున్నాయన్నమాట. అదే ఎచ్చెర్ల, పాతపట్నం లలో వైసీపీ సిట్టింగులను మారిస్తే వైసీపీకి చాన్స్ ఉండవచ్చు అని అంటున్నారు. ఇక మంత్రి ధర్మాన ప్రసాదరావు మళ్ళీ నెగ్గుతారని, ఆయన తనకు సీటు వద్దు కుమారుడికి కావాలని కోరుకుంటే మాత్రం వైసీపీకి కష్టమే అంటున్నారు. ఇక క్రిష్ణదాస్ కి కూడా నరసన్నపేట సీటు ఇబ్బందే అని సర్వే చెబుతోంది.

మరో మారు టెక్కలి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుదే అని కూడా సర్వే చెబుతోంది. ఆయనకు అసలైన ప్రర్యర్ధి తానే అని చెబుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు 24 శాతం మాత్రమే జనాల మద్దతు ఉందని అంటున్నారు. ఆయన కంటే మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికే మరో రెండు శాతం మద్దతు ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇక ఇచ్చాపురం టీడీపీకి ఈసారి కష్టమే అని సర్వే తేల్చింది. పలాసాలో మరో మంత్రి సీదరి అప్పలరాజుకు జనాలు జై కొడుతున్నట్లుగా సర్వే చెబుతోంది.

ఇక ఆముదాలవసల సీటులో స్పీకర్ తమ్మినేని సీతారాం కి ఎదురుగాలి వీస్తోందని ఈ సర్వే తేల్చిందని, ఆయన నిలబడినా వారసుడిగా కుమారుడి చిరంజీవి నాగ్ కి టికెట్ ఇచ్చినా కూడా వైసీపీకి  ఓటమి తప్పదని అంటున్నారు. ఇక్కడ క్యాండిడేట్ ని మారిస్తే ఏమైనా లాభం ఉంటుందేమో చూడాలని అంటున్నారు. దాంతో ఇక్కడ చింతాడ రవికుమార్ వైసీపీ తరఫున ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే ఈ సర్వే వల్ల వైసీపీకి ఇక్కడ కొంత ఇబ్బందికరంగానే సీన్ ఉందని అర్ధమవుతోంది. దీనికి ముందు ఎనిమిది సీట్లలో రెండు టీడీపీకి ఉంటే ఇపుడు నాలుగు సీట్లలో బలంగా ఉంది. మరి రేపటి ఎన్నికల వేళ మెజారిటీ సీట్లు టీడీపీ గెలుస్తుందా. ఈ సర్వేను బట్టి వైసీపీ తన తప్పులు దిద్దుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News