‘‘సామాన్యుడి’’కి ఢిల్లీ ప్రజలు షాకిచ్చారు

Update: 2016-05-17 09:46 GMT
‘సామాన్యుడి’ మీద ఢిల్లీ ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆడియాసలు అయ్యాయా? సంప్రదాయ పార్టీలతో సాధ్యం కానిదేదో సామాన్యుడితో అయిపోతుందన్న నమ్మకంతో మిగిలిన పార్టీలను కోలుకోలేనంత చావుదెబ్బ కొట్టి మరీ.. సామాన్యుడికి తిరుగులేని విధంగా పవర్ ఇస్తే.. ఆ అద్భుత అవకాశాన్ని సామాన్యుడు సద్వినియోగం చేసుకోలేదా? అంటే అవుననే చెప్పాలి.  తాజాగా ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని చూస్తే ఇదే మాట అననుకోక తప్పదు.

సామాన్యుడి రాకతో తమకు  కొండంత అండగ దొరికినట్లు అవుతుందని ఢిల్లీ ప్రజలు పెట్టుకున్న ఆశల్ని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వమ్ము చేసిందన్న భావన తాజాగా వెలువడినఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.  ఢిల్లీలోని13వార్డులకు తాజాగా ఉపఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.

అందరి అంచనాలకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీకి షాకిస్తూ ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారు. మొత్తం 13 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఆఫ్ ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలవగా.. బీజేపీ మూడు స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. తాజాగా జరిగిన 13 వార్డుల్లో 12 వార్డులు ఆఫ్ పార్టీకే చెందినవి కావటం గమనార్హం. కేజ్రీవాల్ ప్రభుత్వం పట్ల ఢిల్లీ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు తాజా ఫలితాలు ఒక నిదర్శనంగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మిగిలిన పార్టీలతో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ స్థానాలు రావటంపై ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News