తమ పార్టీ దగ్గర పైసా లేదంటున్న సీఎం

Update: 2017-01-09 05:57 GMT
రాజకీయ పార్టీగా పేరున్న ఏ పార్టీ సైతం తన పేదరికాన్ని పబ్లిక్ గా చెప్పుకునేందుకు ఇష్టపడదు. ఆ మాటకు వస్తే.. రాజకీయ పార్టీలు పేదరికంతో కొట్టుమిట్టాడటం ఏమిటి కామెడీగా అనే మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇలాంటి వాదనకు భిన్నంగా ఉంటాయి ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తరచూ తన పేదరికాన్ని.. తన పార్టీ దగ్గర డబ్బులు లేనితనం గురించి వాపోతుంటారు.

తాజాగా మరోసారి అలాంటి వాదననే వినిపిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఆయన నోటి నుంచి పేదరికం మాటలువచ్చేస్తుంటాయి. అధికారంలోకి వచ్చిమూడేళ్లు అవుతున్నా.. దమ్మడి మిగుల్చుకునే విషయం మీద తాము ఎప్పుడూ ఆలోచించలేదని.. అందుకే తమ దగ్గర డబ్బుల్లేవని ఆయన తరచూ చెబుతుంటారు.

త్వరలో జరుగుతున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ మూడు రాష్ట్రాల్లో పోటీ చేసేంత శక్తి తమ దగ్గర లేదని ఆయన చెబుతున్నారు. ఆ మాటకు వస్తే.. మరో రెండేళ్లలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డబ్బులు కూడా తమ దగ్గర లేవని ఆయన చెబుతున్నారు. ‘‘ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పోటీ చేయటానికి మా వద్ద పైసా లేదు. మా బ్యాంకు ఖాతాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఢిల్లీలో గడిచిన కొన్నేళ్లుగా అధికారంలో ఉన్నా.. ఎప్పుడూ నిధుల్ని వెనకేసుకునే విషయం గురించి మేం ఎప్పుడూ ఆలోచించలేదు’’ అని ఆయన బీద అరుపులు అరిచేశారు.

ఆమ్ ఆద్మీ నేతలు నిజాయితీపరులని.. బీజేపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతుంటారన్న ఆయన.. గోవా అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు తాము 28 నుంచి 32 స్థానాల్ని సొంతం చేసుకుంటామన్న ధీమానువ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్ ఎన్నికల్లో అకాలీలు.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా తాము దూసుకెళుతున్నట్లుగా ఆయన చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల మాదిరే పంజాబ్ ఎన్నికల బరిలో నిలుచునే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక మ్యానిఫేస్టోను ఆప్ ప్రకటించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో నిలుచునే ఆలోచన తమకు లేదని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఏమైనాపార్టీ భోషాణంలో పైసా లేదంటూనే.. పోటీకి దిగుతున్నఆప్ ను ఆయా రాష్ట్రాల ఓటర్లు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News