సామాన్యుడు సైతం ప‌న్ను ఎగ్గొట్టేశారా?

Update: 2017-11-28 04:41 GMT
నోరు తెరిస్తే నీతులు వ‌ల్లించ‌టం ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ కు అల‌వాటు. రూల్ బుక్ రూల్స్‌ కు ఏ మాత్రం త‌గ్గ‌మ‌న్న‌ట్లుగా చెప్పే ఆయ‌న మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య అంత‌రం ఎక్కువ‌గా ఉంద‌న్న విమ‌ర్శ వినిపిస్తూ ఉంటుంది. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు మూట‌గట్టుకున్న చీపురు పార్టీ తాజాగా మ‌రో మ‌ర‌క‌ను మీదేసుకుంది. పార్టీ చెల్లించాల్సిన ప‌న్ను మొత్తమ్మీద తాజాగా ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది.

పార్టీ సేక‌రించిన విరాళాల‌కు సంబంధించి దాదాపు రూ.30.67 కోట్ల మొత్తాన్ని ప‌న్ను రూపంలో చెల్లించాల్సి ఉంద‌ని.. కానీ అవేమీ చేయ‌లేద‌ని పేర్కొంది. పార్టీ ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తి కానున్న వేళ‌.. హ్యాపీగా ఉన్న పార్టీకి ఐటీ నుంచి నోటీసు రావ‌టం షాకింగ్ గా మారింది. 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో  68.44 కోట్ల రూపాయిల ప‌న్ను చెల్లించ‌ద‌గ్గ ఆదాయం పార్టీకి ఉంద‌ని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించి రూ.30.67 కోట్ల ప‌న్ను మొత్తాన్ని ఎందుకు చెల్లించ‌కూడ‌దో త‌మ‌కు చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు.

రాజ‌కీయాల్ని సంపూర్ణ ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని.. అవినీతి దుమ్మ దులిపివేసేలా  నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని కోత‌లు కోసిన పెద్ద‌మ‌నిషి త‌న పార్టీ త‌ర‌ఫున చెల్లించాల్సిన ఆదాయ‌ప‌న్ను విష‌యంలో క‌క్కుర్తి ప‌డ్డారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లు కొత్తేం కాదు.

ఆ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన నాటి నుంచి ఐటీ శాఖ నుంచి అనేక నోటీసులు అందుకుంది. పార్టీ వెబ్ సైట్‌ లో పేర్కొన్న ఆదాయ మొత్తానికి.. ఐటీ శాఖ‌కు దాఖ‌లు చేసిన వివ‌రాల‌కు పొంత‌న లేద‌న్న‌ది ఐటీ అధికారుల వాద‌న‌. పార్టీ వెబ్ సైట్‌కి.. పార్టీ స్టేట్ మెంట్‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఉందంటూ ఐటీ శాఖ నోటీసులు ఇస్తోంది., తాజాగా మ‌రోసారి నోటీసులు ఇచ్చార‌ని చెప్పాలి.

ఐటీ శాఖ నోటీసుల‌ను ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు క‌క్ష సాధింపు చ‌ర్య‌లుగా అభివ‌ర్ణిస్తున్నారు. భార‌త రాజ‌కీయాల‌ను న‌ల్ల‌ధ‌నం మ‌కిలి నుంచి  బ‌య‌ట‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని.. ఇందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మ‌కు అభినంద‌న‌లు వ‌చ్చిన్ట‌లుగా ఆమ్ ఆద్మీ జాతీయ కోశాధికారి దీప‌క్ వాజ్ పేయ్ వ్యాఖ్యానించారు. తాము ఎంత పార‌ద‌ర్శ‌కంగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌ను ఇబ్బంది పెడుతూనే ఉంద‌ని పేర్కొన్నారు. త‌మ పార్టీకి చిన్న చిన్న మొత్తాల‌ను విరాళంగా ఇచ్చిన వారిని కూడా వేదిస్తోంద‌ని పార్టీ అధినేత‌.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఒక‌వేళ ఐటీశాఖ త‌ప్పులు చేస్తే సాక్ష్యాల‌తో బ‌య‌ట‌కు పెట్టి బ‌ట్ట‌లు ఊడ‌దీయొచ్చుగా అంటూ కేజ్రీవాల్ వ్య‌తిరేక వ‌ర్గం మండిప‌డుతోంది.
Tags:    

Similar News