ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హవాకు బ్రేక్ పడినట్టే!

Update: 2019-05-21 18:00 GMT
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అరవై అసెంబ్లీ సీట్లకు గానూ ఏకంగా యాభై ఏడు సీట్లను సొంతం చేసుకుందని అప్పుడు ఆప్ సునామీని సృష్టించింది. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో ఎక్కడా ఏ పార్టీ కూడా సాధించనటు వంటి విజయాన్ని ఆప్ అక్కడ సాధించింది. అక్కడ నుంచి ఆప్ తిరుగులేని స్థాయికి చేరుతుందని దేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని కొంతమంది అంచనాలు వేశారు.

అయితే విస్తరించడం మాటేమిటో  కానీ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ కు ఎదురుదెబ్బ మాత్రం తప్పదని ఎగ్జిట్ పోల్ సర్వేలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ ఎంపీ సీట్లను నిలబెట్టుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం విశేషం. గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు ఢిల్లీలో బీజేపీ స్వీప్ చేసింది. ఏడు ఎంపీ సీట్లనూ సొంతం చేసుకుంది.

ఈ సారి కూడా అక్కడ బీజేపీ ఫర్వాలేదనిపించుకునే స్థాయిలో ఎంపీ  సీట్లను పొందవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుందనేది పోస్ట్ పోల్ సర్వేల అంచనా. ఒకటీ లేదా రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ పొందవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ సీట్లనే పొందినా, ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఏ అవకాశాన్నీ లేకుండా చేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

ఢిల్లీలోని ఏడు సీట్లలో మెజారిటీ సీట్లను బీజేపీ పొందుతుందని కనీసం ఐదింటిని సొంతం చేసుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ ఒకటీ లేదా రెండు సీట్లను పొందవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం.. అక్కడ ఖాతా తెరవడం కూడా గొప్పే అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉండటం విశేషం అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఐదు శాతం సీట్లను పొందిన పార్టీ లోక్ సభ ఎన్నికలు వచ్చే సారికి బోల్తా పడితే దేశ రాజకీయాల్లో అదో విచిత్రం అవుతుంది!
Tags:    

Similar News