ఢిల్లీ వీధుల్లో చీపురు చిందులు.. ఎగ్జిట్ ఎంగేజ్ ఆప్‌దే!

Update: 2022-12-05 14:19 GMT
దేశాన్నేలుతున్న మోడీకి, ఆయన ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీకి ఇది భారీ షాక‌నే చెప్పాలి. దేశాన్ని ఏలుతున్నా.. దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో మాత్రం క‌మ‌ల వికాసం క‌నిపించ‌డం లేదు. పైగా.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడుతో ఢిల్లీ వీధుల్లో చీపురు.. చిందులు తొక్కింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

మొత్తం ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో 250 వార్డులకు ఈ నెల 4న ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటికి సంబంధించి తాజాగా ఎగ్జిట్ పోల్ రిజ‌ల్ట్ వ‌చ్చేసింది. ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీకి 69 నుంచి 91 సీట్లు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

ఇక‌, ఈ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీ దారుణంగా చతికిలపడింది. 3 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అయితే, వాస్తవ ఫలితాలు ఈ నెల 8న ఎన్నిక‌ల సంఘం ఓట్ల లెక్కింపు చేప‌ట్టి తేల్చ‌నుంది. అయితే. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఏకంగా కేంద్ర మంత్రుల‌ను కూడా ఢిల్లీ వీధుల్లో తిప్పేసింది.

కాలు క‌దుపుతూ.. చేతులూపుతూ.. నోటికి ప‌నిచెప్పిన క‌మ‌ల నాథులు ఇంకేముంది ఢిల్లీ గ‌ద్దెను ఎక్కేసినంత బిల్డ‌ప్ ఇచ్చారు. ఇంకో విష‌యం ఏంటంటే.. ఇలా ప్ర‌చారం చేసిన వారిలో మ‌న తెలుగు వారు స‌త్య‌కుమార్‌, కిష‌న్ రెడ్డి, పురందేశ్వ‌రి వంటివారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 250 వార్డులున్న ఎంసీడీలో మొత్తం 1349 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 709 మంది మహిళలున్నారు. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News