మమతా బెనర్జీకి నిజంగానే పిచ్చి పట్టిందా? వైద్యులేమంటున్నారు?

Update: 2019-06-14 06:27 GMT
పశ్చిమబెంగాల్‌లో బీజేపీ 19 లోక్ సభ సీట్లు గెలుచుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి - తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి పిచ్చిక్కిందని ఆమె వ్యతిరేకులు కొద్దికాలంగా ప్రచారం చేస్తున్నారు. ఆమె నిర్ణయాలు - వ్యాఖ్యలు - ప్రవర్తన కూడా అందుకు తగ్గట్లుగానే ఉండడంతో చాలామంది ఆ ప్రచారం నిజమని నమ్ముతున్నారు. ఎన్నికల తరువాత పశ్చిమబెంగాల్‌ లో చెలరేగిని హింస ఇంకా చల్లారలేదు. బీజేపీ - తృణమూల్ వర్గాల మధ్య ఘర్షణల్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ విజయం సాధిస్తుందో అన్న భయం మమతకు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ఎలా ఎదిరించాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె బీజేపీని నిత్యం మతోన్మాద పార్టీగా ప్రొజెక్ట్ చేసి ఆ రాష్ట్రంలోని ముస్లిం ఓట్లను గంపగుత్తగా పొందాలని అనుకుంటున్నారు. అందుకోసం విచక్షణా రహితంగా ప్రతి సందర్భాన్నీ వాడుకుంటున్నారు. తాజాగా అక్కడ వైద్యుల సమ్మెనూ ఆమె ఇందుకోసం వాడుకోవడంతో మమతకు నిజంగానే పిచ్చెక్కిందా అన్న అనుమానాలు దేశ రాజకీయాలు పరిశీలిస్తున్న అనేకమందిలో బలపడుతున్నాయి.

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌ కతాలో గత మూడు రోజులుగా జరుగుతున్న వైద్యుల సమ్మెకు మమత మతం రంగు పులిమారు. వైద్యుల సమ్మెలోకి బీజేపీని లాగిన ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు బీజేపీ చీఫ్ - హోంమంత్రి ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. ముస్లిం రోగులకు వైద్యం చేయవద్దని బీజేపీ నుంచి వైద్యులకు ఆదేశాలు వెళ్లాయని సంచలన ఆరోపణలు చేశారు. రోగులను హిందూ-ముస్లింలుగా ఎలా విభజిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడూ ఆ పార్టీ ప్రమాదకరమైన ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఓ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి బంధువులు ఓ వైద్యుడి పై దాడిచేయగా.. ఈ ఘటనలో వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తమకు రక్షణ కల్పించాల్సిందిగా వైద్యులు సమ్మెకు దిగారు. సమ్మె పిలుపుతో ఎమర్జెన్సీ వార్డులు - అవుట్ డోర్ సేవలు - పాథలాజికల్ యూనిట్లతోపాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు - ఆసుపత్రులు - ప్రైవేటు ఆసుపత్రులు మూతపడ్డాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఈ సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

అయితే.. ఇలాంటి తరుణంలో మమత.. బీజేపీ ముస్లిం రోగులకు వైద్యం చేయొద్దని ఆదేశించిందని చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమతే ఉండగా ఆ రాష్ట్రంలోని వైద్యులకు కేంద్రం ఎలా ఆదేశాలు జారీ చేస్తుందన్నది.. అలాంటప్పుడు మమత ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీని బూచిగా చూపడానికి ఇలాంటి క్లిష్ట సమయాన్ని కూడా మమత అత్యంత దారుణంగా, దిగజారి వాడుకున్నారని అర్థమవుతోంది.

కాగా... ఈ సమ్మె నేపథ్యంలో వైద్యులు కూడా తీవ్రంగానే స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలలోగా వైద్యులు విధుల్లోకి రాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయన్న మమత హెచ్చరికలకు వారు లొంగలేదు. సాయుధ పోలీసు బలగాలతో తమకు రక్షణ కల్పిస్తేనే విధుల్లోకి వస్తామన్నారు. తమపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్త సమ్మె తప్పదన్నారు. మరోవైపు కోల్‌ కతా వైద్యుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం దిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సైతం సమ్మె చేస్తున్నారు.
Tags:    

Similar News