జాగ్ర‌త్త‌గా డ్రైవ్ చేసినా ప్రాణాలు పోయాయి

Update: 2017-07-10 08:01 GMT
"మ‌నం స‌రిగా డ్రైవ్ చేస్తే స‌రిపోదు.. ప‌క్క‌నోడు కూడా అంతే జాగ్ర‌త్త‌గా డ్రైవ్ చేయాలి" అన్న మాట ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసేలా డ్రైవ్ చేస్తున్న వారి పుణ్య‌మా అని.. ప్ర‌మాదాలు త‌ర‌చూ చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు భ‌ద్ర‌త మీద ప్ర‌భుత్వాలు స‌రిగా దృష్టి పెట్ట‌క‌పోవ‌టం కార‌ణంగా ఇటీవ‌ల కాలంలో పెద్ద సంఖ్య‌లో రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణిస్తున్న విషాద ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక రోడ్డు యాక్సిడెంట్ సీసీ కెమేరా ఫుటేజ్ వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను చూసినంత‌నే అనిపించేది ఒక్క‌టే.. మ‌నం స‌రిగా డ్రైవ్ చేస్తే స‌రిపోదు.. ప‌క్క‌నోడు ఫాస్ట్ గా వెళ్లినా పోయేది మ‌న ప్రాణాలే అనిపించ‌క మాన‌దు.

దేశ రాజ‌ధాని ఢిల్లీకి స‌మీపంలోని గ్రేట‌ర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. రూల్స్‌ ను బ్రేక్ చేస్తూ అమిత వేగంతో డ్రైవ్ చేయ‌ట‌మే ఎక్కువ ప్ర‌మాదాల‌కు కార‌ణం. తాజా యాక్సిడెంట్ ఉదంతంలో అతి వేగంగా వెళుతోన్న వాహ‌నం ఒక‌టి మ‌రో వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేసే క్ర‌మంలో బ‌లంగా తాకింది.

అంతే.. అవ‌త‌లి వాహ‌నం ప‌ల్టీలు కొట్టుకుంటూ ప‌క్క‌కు వెళ్లి ప‌డింది. ఈ ఉదంతంలో ఒక‌రు మ‌ర‌ణించారు. సీసీ కెమేరాల్లో రికార్డు అయిన ఈ యాక్సిడెంట్ ఫుటేజ్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఎనిమిది వ‌రుస‌ల ఎక్స్ ప్రెస్ వేపై ఒక మార్గంలో స్విఫ్ట్ డిజైర్ కారు ఎడ‌మ వైపు వెళుతున్న మ‌రో కారును ఓవ‌ర్ టేక్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో.. ఆ వాహ‌నాన్ని డ్రైవ‌ర్ ఎడ‌మ‌వైపున‌కు తిప్పాడు. మ‌రో వ‌రుస‌లో వ‌స్తున్న మారుతి ఎకో కారు ఆ వాహ‌నాన్ని ఢీ కొట్టి ప‌ల్టీలు కొట్టి ప‌క్క‌నే ఉన్న పొద‌ల్లోకి దూసుకెళ్లింది. ప‌ల్టీ కొట్టిన వాహ‌నంలోని వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

అత‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లుగా వైద్యులు ప్ర‌క‌టించారు. ఈ విషాద ఉదంతంలో మ‌రో వ్య‌క్తి పెను ప్ర‌మాదం నుంచి తృటితో త‌ప్పించుకున్నాడు. ఎకో వాహ‌నం ప‌ల్టీలు కొట్టే స‌మ‌యంలో దానికి స‌మీపంలో వెళుతున్న ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు ప్ర‌మాదం కాకుండా త‌ప్పించుకున్నాడు.

Full View
Tags:    

Similar News