ఆఫ్ఘన్ పరిస్థితి కేవలం ఐదు రోజుల్లోనే .. !

Update: 2021-08-20 12:30 GMT
ఆఫ్ఘనిస్తాన్ .. గత కొన్ని రోజులవరకు ఇది కూడా ప్రపంచంలో ఓ దేశంగా కొనసాగింది. ఇప్పుడు కూడా ప్రపంచంలో దేశమే కానీ, అక్కడ ప్రస్తుతం తాలిబన్ల రాజ్యం ప్రారంభం అయ్యింది. గత 20 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న దేశాల ప్రయత్నాలు తీవ్ర ఎదురుదెబ్బకు గురయ్యాయి. వీటిలో అమెరికా, నాటో దేశాలతోపాటు భారత్ కూడా ఉంది. 2001 కి ముందు, ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో 90% తాలిబాన్ నియంత్రణలో ఉంది. ఈ కాలంలో షరియా చట్టం ఖచ్చితంగా అమలు చేశారు. మహిళలు బురఖా ధరించాలని కోరారు. సంగీతం, టీవీల పై నిషేధం విధించారు. పొట్టి గడ్డాలు ఉన్న పురుషులను జైలులో పడేశారు. ప్రజల సామాజిక అవసరాలు, మానవ హక్కులు కూడా ఆ సమయంలో పూర్తిగా విస్మరించారు. ఆ తర్వాత అమెరికా ఎంట్రీ తో ఆఫ్ఘన్ కూడా ప్రపంచం లోని మిగిలిన దేశాలలాగే కొనసాగింది.

అయితే , అమెరికా ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుండి వెనక్కి తగ్గిందో , సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న తాలిబన్లు ఒక్కసారిగా ఆఫ్ఘన్ పై విరుచుకుపడి తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు తాలిబన్ల రాజ్యం ఎలా ఉంటుందో ఊహించుకుని బెంబేలెత్తిపోతున్నారు.  ఆగ‌స్టు 15 కి ముందు ఆ కాబూల్‌లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ఆగ‌స్టు 15 త‌రువాత ప‌రిస్థితులు ఎలా మారిపోయాయో అందిరికి తెలిసిందే.  ఆగ‌స్టు 15కి ముందు కాబూల్ న‌గ‌రంలో యువ‌త చాలా మోడ్ర‌న్‌గా క‌నిపించేవారు. జీన్స్, టీష‌ర్ట్ తో పాశ్ఛాత్య సంస్కృతికి ఏ మాత్రం తీసిపోకుండా క‌నిపించేవారు.  24 గంట‌లు ఆ న‌గ‌రంలో బ‌య‌ట యువ‌త సంచ‌రించేవారు.  

అయితే, ఆగ‌స్టు 15 త‌రువాత పూర్తిగా మారిపోయింది. పెద్ద వ‌య‌సువారితో పాటుగా, యువ‌త కూడా సాధార‌ణ దుస్తులు ధ‌రించి బ‌య‌ట‌కు రావ‌డం మొద‌లుపెట్టారు. జీన్స్ వేసుకున్న‌వ్య‌క్తులు మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. మ‌హిళ‌లు నిండుగా బురఖా ధ‌రించి మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  కుటుంబ స‌భ్యుల తోడు లేకుండా ఒంట‌రిగా బ‌య‌ట‌కు వ‌చ్చారు అంటే తిరిగి ఇంటికి వ‌స్తారో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఆఫ్ఘ‌న్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక తాము గ‌త పాల‌కుల‌కు భిన్నంగా ప‌రిపాల‌న సాగిస్తామ‌ని, మ‌హిళ‌ల‌కు రాజ‌కీయాల్లో ప్రాధాన్య‌త క‌ల్పిస్తామ‌ని చెబుతున్నా, దానికి భిన్నంగా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

తాలిబన్ల రాజ్యంలో ఇంట్లోని కిటికీలు పారదర్శకంగా ఉంటే బయట వ్యక్తులు మహిళలను చూసే అవకాశం ఉంటుంది.. కాబట్టి అలా ఉండకూడదు. వాటికి కచ్చితంగా రంగులు వేయాలి. మహిళలు ఫోటోలు తీసుకోకూడదు. వారి ఫోటోలు పత్రికలు, పుస్తకాలు లేదా ఇంట్లో పెట్టకూడదు. ఏదైనా ప్రాంతానికి మహిళ పేరు ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఏదైనా బహిరంగ కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనకూడదు. మహిళలు గోర్లకు పెయింట్ వేసుకోకూడదు. వాళ్లు స్వచ్ఛందంగా పెళ్లి చేసుకోకూడదు.

కురుచు దుస్తులు వేసుకున్న వారికి కూడా ఇదే రకమైన శిక్షలు విధిస్తారు. తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లిని కాదని అమ్మాయి పారిపోతే.. ఆమె ముక్కు, చెవులు కోసేస్తారు. గోర్లకు పెయింట్ వేసుకుంటే వేళ్లను నరికేస్తారు. ఈ నియమాలను అతిక్రమించిన వారికి కఠినమైన శిక్షలు వేస్తారు. వారికి బహిరంగంగా శిక్షలు వేస్తారు. కొందరిని ఈ రకంగా చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి ఘోరమైన తాలిబన్ల పాలన మళ్లీ వస్తుందేమో అని ఆఫ్ఘనిస్తాన్ మహిళలు వణికిపోతున్నారు.
Tags:    

Similar News