దీపావళి కావటమే తరువాయి ఎన్నికల సందడే

Update: 2019-10-24 05:22 GMT
కాస్త గ్యాప్ తో బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా తెలంగాణలో ఎన్నికల సందడి చోటుచేసుకుంటోంది. ముందస్తు ఎన్నికల నాటి నుంచి నేటి వరకూ కాస్త గ్యాప్ తోనే వరుస పెట్టి ఎన్నికల వాతావరణం నెలకొంటోంది. గతంలో ఉప ఎన్నిక జరిగితే పెద్ద ఆసక్తి వ్యక్తమయ్యేది కాదు. కానీ.. మారిన కాలంలో ప్రతి ఎన్నికకు తనదైన ప్రాధాన్యత చోటు చేసుకోవటంతో పార్టీలు ప్రయారిటీ ఇస్తున్నాయి.

దీనికి తగ్గట్లే మీడియాలోనూ ప్రాధాన్యత ఇవ్వటం పెరిగింది. ఈ రోజు వెల్లడి కానున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక దీనికో చక్కటి ఉదాహరణగా చెప్పాలి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా (హైదరాబాద్ సహా కొన్ని చోట్ల మినహాయించి) పురపాలక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో నవంబరు 21 లోపు ఎన్నికల్ని పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

ఇప్పటివరకూ ఉన్న అంచనాలకు తగ్గట్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మాత్రం దీపావళి పండుగ పూర్తి అయిన వారం లోపే ఎన్నికల నోటిఫికేషన్ కు అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం 68 పురపాలక సంఘాలకు సంబంధించి వార్డుల పునర్విభజన కేసులు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఈ కేసుల్ని ఒక  కొలిక్కి తీసుకు రావటం ఖాయం.

రిజర్వేషన్లపై పురపాలక సంఘం కసరత్తు చేస్తోంది. ఆ జాబితాను ఎన్నికల సంఘానికి అందించిన వెంటనే.. ఎన్నికల సంఘం పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెబుతున్నారు. అసెంబ్లీ.. సార్వత్రిక ఎన్నికలకు భిన్నంగా స్థానిక ఎన్నికల్ని బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనున్నారు. ఇక.. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు.. సిరాతోసహా ఇతర ముడి సామాగ్రిని ఎన్నికల సంఘం ఇప్పటికే సమకూర్చుకుంది.

వార్డుల పునర్విభజనకు సంబంధించిన స్పష్టత రావటం.. ఆ వెంటనే ఎన్నికల ప్రకటనను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుందని అంటున్నారు. అన్ని అనుకున్నట్లు సాగితే.. దీపావళి పూర్తి అయిన వారంలోనే స్థానిక సమరానికి నగరా మోగుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News