కానిస్టేబుల్ వేధింపులకు పీ.హెచ్.డీ విద్యార్థిని ఆత్మహత్య... చివరి కోరికలివే!
ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఆయన కుమార్తెను వేధించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది
ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఆయన కుమార్తెను వేధించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ సందర్భంగా... కానిస్టేబుల్ వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దీప్తి విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.
అవును... కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీ.హెచ్.డీ. విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమెను వేధించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది! ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాళ్లోకి వెళ్తే... నాచారంలోని బాపూజీనగర్ సరస్వతీకాలనీకి చెందిన దీప్తి (28) హబసిగూడలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఆమె తండ్రి సంగీతరావు అదే ఐఐసీటీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ సమయంలో ఆయనకు డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అనిల్ తో పరిచయమైంది.
ఈ నేపథ్యంలో అనిల్ అనే కానిస్టేబుల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం రూ.15 లక్షలు తీసుకున్నాడట సంగీతరావు. అయితే.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఉద్యోగం ఇప్పించలేదంట. దీంతో... తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అనిల్.. సంగీతరావు కుమార్తె దీప్తిని నిత్యం అడిగేవాడంట.
ఇలా నిత్యం తనను డబ్బులు అడుగుతుంటే.. డబ్బు తీసుకున్నది తన తండ్రి అని.. ఆయన ఇప్పుడు తమతో కలిసి ఉండటం లేదని.. దీప్తి సమాధానం చెప్పిందంట. ఈ నేపథ్యంలో అనిల్ తన భార్య అనితతో కలిసి నాచారం పీఎస్ లో ఫిర్యాదు చేయించాడు. దీంతో... వీరి వద్ద డబ్బులు తీసుకున్నట్లు చెబుతున్న సంగీతరావుతో పాటు దీప్తిపైనా చీటింగ్ కేసు నమోదు చేశారు!
ఇదే సమయంలో.. కానిస్టేబుల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారంట. దీంతో.. మనస్తాపానికి గురైన దీప్తి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆ సమయంలో తల్లి వచ్చి చూసేసరికే ఆమె మరణించిందని చెబుతున్నారు.
ఈ సమయంలో ఆమె ఫోన్ ను చెక్ చేయగా సెల్ఫీ వీడియో ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... తన మరణానికి కానిస్టేబుల్ అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం అని.. తన తండ్రి డబ్బు తీసుకుంటే తనపై నకిలీ కేసు నమోదు చేయించి, జీవితాన్ని నాశనం చేశారని.. ఈ కేసుల మీద పోరాడే స్తోమత తనకు లేదని ఆమె వెల్లడించిందని చెబుతున్నారు.
ఇదే సమయంలో... తన చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాలని.. తన మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయాలని ఆమె తన చివరి కోరికలు కన్నీరు పెట్టుకుంటూ కోరిందని తెలుస్తోంది. దీంతో... దీప్తి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు సంగీతరావు, అనిల్, అనిత, సోమయ్య మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే సంగీతరావు, అనిత, ఆమె తండ్రి సోమయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా.. అనిత భర్త అనిల్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా దీప్తి చివరి కోరికలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, పోలీసులపైనా ఉందని నెటిజన్లు స్పందిస్తున్నారు!