ఇంకో బ్యాంక్ స్కాం..3792 కోట్ల స్వాహా

Update: 2018-03-01 06:47 GMT
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఓవైపు మోసాలు - మరోవైపు రుణాల ఎగవేతలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. కాన్పూర్‌ కు చెందిన రొటోమాక్ పెన్స్ కుంభకోణం మరువకముందే.. అక్కడికే చెందిన మరో సంస్థ 16 బ్యాంకులకు ఏకంగా రూ.3,972 కోట్ల రుణాలను ఎగవేసిన వ్యవహారం తెరపైకి వచ్చింది. శ్రీ లక్ష్మీ కోట్సిన్ ప్రైవేట్ లిమిటెడ్...సెంట్రల్ బ్యాంక్ నేతృత్వంలోని 16 బ్యాంకుల కూటమి వద్ద ఈ రుణాలను తీసుకోగా - వీటి ఎగవేతకు పాల్పడిందన్న ఆరోపణలను ఆ సంస్థ ఎదుర్కొంటోంది. కాన్పూర్‌ లోని జీటీ రోడ్డులోగల కృష్ణాపురం వద్ద శ్రీ లక్ష్మీ కోట్సిన్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ గ్రూప్ చైర్మన్ - మేనేజింగ్ డైరెక్టర్ ఎంపీ అగర్వాల్. టెక్స్‌ టైల్స్‌తోపాటు ఆటోమొబైల్ బ్లాస్ట్ ప్రూఫ్‌ లనూ ఈ కంపెనీ తయారు చేస్తుంది.

కాగా - రుణాల వసూళ్లలో భాగంగా సదరు సంస్థ ఆస్తుల వేలాన్ని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ప్రారంభించింది. అయితే బ్యాలెన్స్ షీట్ ప్రకారం సంస్థ ఆస్తులు రూ.1,495 కోట్లుగానే ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో సంస్థ డిపాజిట్లు రూ.2.54 కోట్లకే పరిమితమయ్యాయి. సంస్థ నిర్వహణ వ్యయం రూ.577 కోట్లుగా - ఆదాయం రూ.311 కోట్లుగా ఉన్నది. అయినప్పటికీ పాత బకాయిల్ని తీర్చడం కోసం కొత్త రుణాల్ని ఇచ్చిన బ్యాంకులకు.. శ్రీ లక్ష్మీ కోట్సిన్ చివరకు అప్పుల కుప్పగానే మిగిలింది. ఈ సంస్థ దాదాపు రూ.1,646.12 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. ఫలితంగా బ్యాంకులకిప్పుడు తమ బకాయిల వసూలు తలకు మించిన భారంగా పరిణమించింది. శ్రీ లక్ష్మీ కోట్సిన్ దీర్ఘకాలిక రుణం రూ.2,406 కోట్లుగా - స్వల్పకాలిక రుణం దాదాపు రూ.937 కోట్లుగా ఉంది.  వడ్డీతో కలిపి మొత్తం రుణాల విలువ రూ.3,972 కోట్లకు చేరగా - వీటి వసూలుకు కంపెనీకి చెందిన నాలుగు యూనిట్లను బ్యాంకులు అమ్మేశాయి కూడా. అవి కూడా మూతబడి ఉన్నవే కావడం గమనార్హం.

ఇదిలావుంటే ఈ సంస్థపై తొలుత సెంట్రల్ బ్యాంక్.. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌ టీ)ను ఆశ్రయించగా - ఖాయిలా పరిశ్రమగా రాజీ పరిశీలన కోసం 2016 నవంబర్ 30న ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ కు బదిలీ కావడం గమనార్హం. శ్రీ లక్ష్మీ కోట్సిన్‌ కు రుణాలిచ్చిన బ్యాంకుల్లో సెంట్రల్ బ్యాంక్‌ తోపాటు సిండికేట్ - యూనియన్ బ్యాంక్ - కెనరా - బ్యాంక్ ఆఫ్ బరోడా - పీఎన్‌ బీ - ఇండియన్ బ్యాంక్ - ఎస్‌ బీఐ - ఎగ్జిమ్ బ్యాంక్ - ఓబీసీ - ఐడీబీఐ - విజయా - కార్పొరేషన్ - సారస్వత్ - ఆంధ్రా బ్యాంకులున్నాయి. ఎడిల్‌ వీస్ ఎస్టేట్ రీకన్‌ స్ట్రక్షన్ కూడా శ్రీ లక్ష్మీ కోట్సిన్‌ కు రుణమిచ్చింది.

Tags:    

Similar News