సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే!

Update: 2022-11-18 07:30 GMT
ప్రస్తుతం ప్రజలంతా తమ అవసరాల కోసం స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌లు, ట్యాబ్‌లు వాడుతున్నారు. ఇవి మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. మార్కెట్‌లో పలు రకాల కంపెనీల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను ప్రజలు తమ అభిరుచులకనుగుణంగా వినియోగిస్తున్నారు.

అయితే ఒక్కో దానికి ఒక్కో రకమైన ఛార్జర్‌ వాడాల్సి రావడం అతిపెద్ద సమస్యగా మారింది. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని స్మార్ట్‌ పరికరాలు అంటే అన్ని ఛార్జర్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒకటే చార్జర్‌ పిన్‌ అన్నిటికి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ ఇబ్బందిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల చార్జింగ్‌కు ఒకే ఒక చార్జింగ్‌ పోర్ట్‌ రానుంది. అంటే, అన్ని రకాల స్మార్ట్‌ డివైస్‌లకు ఇక ఒకటే చార్జర్‌ ఉంటే సరిపోతుంది. ఒకటే చార్జర్‌ను దశలవారీగా అమలు చేసేందుకు ఆయా కంపెనీలు, పరిశ్రమలు అంగీకరించాయి.

దీంతో స్మార్ట్‌ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ టాప్‌ లకు యూఎస్‌బీ టైప్‌–సి ఛార్జింగ్‌ పోర్టుని అమరుస్తారు. అయితే ఫీచర్‌ ఫోన్లకు మాత్రం ఈ సదుపాయం ఉండదు. ఫీచర్‌ ఫోన్లకు ప్రత్యేక పోర్ట్‌ ఉండనుంది.

స్మార్ట్‌ పరికరాలలో యూఎస్‌బీ వినియోగాన్ని ఈయూ (యూరోపియన్‌ యూనియన్‌) తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా అన్ని స్మార్ట్‌ పరికరాలకు ఒకటే చార్జర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. అనేక రకాల చార్జర్‌లు ఉండటం.. ప్రజలకు తలెత్తుతున్న సమస్యపై చర్చించడానికి  కేంద్ర ప్రభుత్వం మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అన్ని స్మార్ట్‌ పరికరాల్లో యూఎస్‌బీ–సీని తప్పనిసరి చేయడానికి అంగీకరించింది.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్వహించిన ఎలక్ట్రానిక్‌ కంపెనీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. దీంతో దేశంలో అన్ని స్మార్ట్‌ పరికరాల కోసం యూఎస్‌బీ–సీని చార్జింగ్‌ పోర్టుగా ప్రవేశపెడతామని  వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.

అన్ని స్మార్ట్‌ పరికరాలకు ఒకేరకమైన ఛార్జింగ్‌ పోర్ట్‌ అనేది.. ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు, భారతదేశంలో ఐఫోన్‌ కొనాలనుకునే వారికి శుభవార్తే అంటున్నాయి మొబైల్‌ తయారీ పరిశ్రమలు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News