డోక్లాంఃఅనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చిన చైనా

Update: 2017-12-20 04:51 GMT
ర‌చ్చ‌కు ఎక్కేందుకే ప్రాధాన్యం ఇచ్చే పొరుగు దేశం చైనా అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చింది. కావాల‌ని కెలుక్కుంటున్న డోక్లాం వివాదంలో శాంతి మంత్రం జ‌పిస్తోంది. చ‌ర్చ‌లు కోరుతోంది. కీల‌క‌మైన డోక్లాం విష‌యంలో చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం చేసుకుందామ‌ని భార‌త్‌ కు చైనా ప్ర‌తిపాదించ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు భారత్‌ - చైనా మధ్య శుక్రవారంనాడు జరిగే సరిహద్దు చర్చల్లో డోక్లాం వివాదం కీలకం కానుంది.

సరిహద్దు వివాదంపై ఇప్పటికే 19 విడతలుగా చర్చలు జరిగాయి. 20వ దఫా చర్చల్లో భారత భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ - చైనా స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జైచి పాల్గొననున్నారు. సిక్కిం సెక్టార్‌ లో డోక్లాం వివాదం సద్దుమణిగిన తర్వాత ఉభయ దేశాల మధ్య చర్చలు జరుగటం ఇదే మొదటిసారి. ప్రత్యేక ప్రతినిధుల మధ్య జరిగే ఈ సమావేశంలో సరిహద్దు సమస్యల మీద మాత్రమే కాకుండా వ్యూహాత్మక సమాచారంపై  కూడా దృష్టిసారించనున్నట్టు  చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హూ చినియాంగ్‌ మీడియాతో అన్నారు. ప్రధాన అంతర్జాతీయ - ప్రాంతీయ సమస్యలపై కూడా పరస్పరం ఆలోచనలు పంచుకోనున్నట్టు ఆమె చెప్పారు.

2017లో ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలే కొనసాగిన్పప్పటికీ - డోక్లాం సంఘటన ప్రధాన పరీక్షగా మారిందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హూ చినియాంగ్‌ వ్యాఖ్యానించారు. ఈ తరహా సమస్యలు భవిష్యత్‌ లో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే  డోక్లాం వివాదం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. భారత్‌ - చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ప్రశాంతతను నెలకొల్పే విషయంలో గతంలో జరిగిన చారిత్రక ఒప్పందాలను అనుసరిస్తామని చెప్పారు. డోక్లాం ప్రతిష్ఠంభనపై  ఇటీవల న్యూఢిల్లీ సందర్శించిన చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ.. భారత్‌ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ - రాష్ట్రపతి రామ్‌ నాధ్‌ కోవింద్‌ తో చర్చించినట్టు మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ - వ్యూహాత్మక - ఆర్థిక - వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధులు చర్చలు సాగిస్తారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హూ చినియాంగ్‌  చెప్పారు. డోక్లాం ప్రాంతంలో గత జూన్‌ 16న రోడ్డు నిర్మించేందుకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రయత్నించగా - భారత సైన్యం అడ్డుకుంది. దాదాపు 73 రోజులపాటు కొనసాగిన ఈ వివాదం ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆగస్టు 28న సద్దుమణిగింది.
Tags:    

Similar News