అజిత్ పవార్: ఒకే దెబ్బకు మూడు పిట్టలు

Update: 2019-11-29 11:32 GMT
మహారాష్ట్ర బీజేపీ చేజారిపోయింది. ఎన్నో ఆశలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కలలుగన్న ఆ పార్టీకి శివసేన షాకిచ్చింది. కేంద్రంలో అధికారం ఉండి కూడా ఇలా ఓ ప్రాంతీయ పార్టీ చేతిలో ఓడిపోయిన బీజేపీకి అవమానం మిగిలింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అంతిమంగా లాభపడింది ఒకే ఒక్కడు అతడే ‘అజిత్ పవార్’.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై తిరుగుబాటు చేసినప్పటికీ ఇప్పుడు అజిత్ పవార్ ను ఎన్సీపీ పక్కనపెట్టకపోవడం విశేషం. కొత్త ప్రభుత్వంలో ఈయనకు డిప్యూటీ సీఎం పోస్టు ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఎన్సీపీ తరుఫున కీరోల్ పోషించేది అజిత్ పవారే అని మహారాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా కూడా డిప్యూటీ సీఎంగా అజిత్ పవారే ఉండేవారు. ఫిరాయించి బీజేపీలో చేరిన ఆయనకు ఎన్నో లాభాలు కూడా కలిగాయి. అజిత్ పవార్ మహారాష్ట్రలో బీజేపీకి మద్దతు తెలుపడంతో ఒప్పందం ప్రాకారం ఆయనపై నమోదైన ఐటీ - ఈడీ కేసులను బీజేపీ ఎత్తివేసిందన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు తిరిగి ఎన్సీపీలో చేరి శరద్ పవారే తమ నాయుకుడు అని అజిత్ ప్రకటించారు.

నిజానికి ఎన్సీపీలో అజిత్ పవార్ పవర్ ఫుల్ లీడర్. ఆయనకు మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో గట్టి పట్టు ఉంది. చాలా మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించారు. అత్యధిక ఓట్ల తేడాతో ప్రత్యర్థులకు డిపాజిట్ గల్లంతు చేశారు. డిప్యూటీ సీఎం - మంత్రిగా అనేకసార్లు పనిచేశారు.

ఇప్పుడు ఎన్సీపీలో అజిత్ పవార్ ను పక్కనపెట్టలేని పరిస్థితి ఉంది. ఆయన విరోధిగా ఉంటే ఎన్సీపీ చీలిపోవడం ఖాయం. అందుకే కుటుంబ పరంగా - పార్టీ పరంగా ఆయనకే డిప్యూటీ సీఎంగా చేస్తారని తెలుస్తోంది. మరాఠా రాజకీయాల్లో ఒక శక్తిగా ఉన్న అజిత్ పవార్ ను కాలదన్నితే ఎన్సీపీ మనుగడకే ప్రమాదమని గ్రహించే శరద్ పవార్ ఫిరాయించినా కూడా అజిత్ నే పార్టీ స్టార్ నాయకుడిగా భావిస్తున్నాడట.. గౌరవ ప్రదమైన పునరావాసం కల్పించడానికి రెడీ అయ్యాడట.. తద్వారా పార్టీలో అసమ్మతి రాకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట..

ఇలా బీజేపీకి ఫిరాయించినా.. ఇప్పుడు ఎన్సీపీలో చేరినా మొత్తం రాజకీయ నాటకంలో కీలక పాత్రధారి అయిన అజిత్ పవార్ రెంటికి చెడ్డ కానీ ఇప్పుడు కీలక నేతగా మారిపోయారు. అధికారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మొత్తం ఎపిసోడ్ లో అసలైన అతిపెద్ద లబ్ధిదారుగా అజిత్  పవార్ నిలిచాడు.


Tags:    

Similar News