ఎన్నార్సి - సిఏఏకి వ్యతిరేకంగా సైకిల్ ఎక్కిన మాజీ సీఎం!

Update: 2019-12-31 13:54 GMT
గత కొన్ని రోజులుగా దేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు, జాతీయ జనాభా నమోదు లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన మొదటి రోజు నుండి ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనలో ఇప్పటికే 26 మంది వరకు ప్రాణాలని విడిచారు. ముఖ్యంగా యూపీ  - అస్సాం - ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఆందోళనలు ఉదృతంగా సాగించారు.

అయితే, ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్ లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు - ఆందోళనకు భిన్నంగా శాంతియుత ప్రదర్శనలకు తెర తీసింది సమాజ్ వాది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సైకిల్ ర్యాలీని నిర్వహించింది. సమాజ్ వాది పార్టీ అధినేత - మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంగళవారం ఉదయం రాజధాని లక్నోలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అసెంబ్లీ భవనం దాకా ఈ ర్యాలీని చేపట్టారు. అఖిలేష్ యాదవ్ కూడా సైకిల్ పైనే అసెంబ్లీ భవనానికి చేరుకున్నారు.

అసెంబ్లీ ఆవరణలోనే నిరసన ప్రదర్శనలను చేపట్టారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  పైన కూడా  విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ..బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ   పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు - జాతీయ జనాభా నమోదు కార్యక్రమాలను అమలు చేయడానికి ఆసక్తిగా లేవని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని నిర్బంధంగా అమలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశాన్ని ముస్లిం రహితంగా మార్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాలను బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తోందని మండి పడ్డారు.  అలాగే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.


Tags:    

Similar News