యూపీలో పొలిటిక‌ల్ హీట్‌.. ఆ పార్టీతో అఖిలేష్ పొత్తు

Update: 2021-12-08 08:44 GMT
దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ రాజ‌కీయ వేడి ర‌గులుతోంది. ఆ రాష్ట్రంలోని 403 శాస‌న స‌భ స్థానాల‌కు వ‌చ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఆ ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు నెల‌లు మాత్ర‌మే ఉండ‌డంతో అక్క‌డ విజ‌యంపై రాజ‌కీయ పార్టీలు దృష్టి సారించాయి. అక్క‌డి అధికార బీజేపీతో పాటు స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్తో పాటు తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ కూడా ఎన్నిక‌ల రేసులో గెల‌వ‌డం కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాయి.


ఇప్ప‌టికే..

వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా జ‌రిగే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టికే పార్టీలు రంగంలోకి దిగాయి. దీంతో అక్క‌డ ఇప్పుడే ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. గత ఎన్నిక‌ల్లో భారీ విజ‌యంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మ‌రోసారి ముఖ్య‌మంత్రి యోగీ సార‌థ్యంలో విజ‌యంపై క‌న్నేసింది. స‌ర్వేల ఫ‌లితాలు, అంచ‌నాలు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి.

ఇప్ప‌టికే ఆ పార్టీ ఆప‌రేష‌న్ యూపీ ప్రారంభించింది. ఆ ఎన్నిక‌ల కోసం రాష్ట్రంలో కేంద్ర మంత్రుల‌ను ఇంఛార్జీలుగా నియ‌మించింది. రీజియ‌న్ల వారీగా ప్ర‌చార క‌మిటీల‌ను ఏర్పాటు చేసి ప్ర‌చారాన్ని ప్రారంభించింది.

పోటీకి దూర‌మైనా..

రాష్ట్రంలో అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అస్త్రాల‌కు ప‌దును పెడుతున్నారు. ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ త‌న పార్టీకి విజ‌యాన్ని అందించేందుకు శ్ర‌మిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు పెట్టుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఈ విష‌యాన్ని ఆర్ఎల్డీ అధ్య‌క్షుడు జ‌యంత్ చౌద‌రి కూడా అధికారికంగా వెల్ల‌డించారు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్పీ, ఆర్ఎల్డీ క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. కానీ ఇంకా సీట్ల స‌ర్దుబాటుపై మాత్రం నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూట‌మి గెలుస్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేసిన జ‌యంత్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొట్ట‌మొద‌ట‌గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడి ప్రాణాలు విడిచిన రైతుల కోసం స్మార‌కాన్ని క‌ట్టిస్తామ‌ని పేర్కొన్నారు.


ఒంటరిగానే..

మ‌రోవైపు ప్ర‌ధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగేందుకే మొగ్గు చూపుతోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమ‌ని అన్ని స్థానాల్లోనూ త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపుతాయ‌ని యూపీ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త తీసుకున్న ప్రియాంక గాంధీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు అధికార బీజేపీతో పాటు బీఎస్పీ కూడా ఒంట‌రిగానే పోటీ చేయ‌నుంది. ఇత‌ర పార్టీల‌తో పొత్తుల విష‌యంపై బీఎస్పీ అధినేత్రి మ‌యావ‌తి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అంతే కాకుండా దేశ‌వ్యాప్తంగా పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా టీఎంసీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టే అవ‌కాశాలున్నాయి. ఇక ఎంఐఎం కూడా త‌న సత్తా చాటాల‌ని చూస్తోంది.
Tags:    

Similar News