ఆ సీఎంతో క్రికెట్ ఆట ఎంత వణుకంటే..?

Update: 2016-03-22 04:39 GMT
ఆటను ఆటగా చూసే వాళ్లు కొందరైతే.. ఆట ఏదైనా తమదే పైచేయి కావాలన్నట్లుగా వ్యవహరించే వ్యక్తులు కనిపిస్తుంటారు. ఈ తరహా వ్యక్తులు సినిమాల్లో తరచూ కనిపిస్తుంటారు. అందుకు ఏ మాత్రం తీసిపోరన్న విషయం ఒక సీఎం విషయంలో తాజాగా స్పష్టం కావటమే కాదు.. ఇప్పుడిది ఒక హాట్ టాపిక్ గా మారింది. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.

యూపీలో నాలుగు రోజులు ఐఏఎస్ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం ఎలెవెన్ జట్టుతో.. ఐఏఎస్ లెవెన్ జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలపటంతో పాటు.. ఆయన జట్టును గెలిపించేందుకు పడిన పాట్లు చూస్తే.. ఔరా అనుకోవాల్సిందే.

65 పరుగుల వ్యక్తిగత స్కోర్ తో వెళుతున్న సీఎం అఖిలేశ్ ను ఒక ఐఏఎస్ అధికారి ఔట్ చేశారు. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆటలో ఔట్ చేసినా.. ఆట తర్వాత తన పరిస్థితి ఏమవుతుందో అన్నట్లుగా సదరు అధికారి వ్యవహర శైలి ఉండటమే కాదు.. సీఎం ఎలెవెన్ జట్టును ఓడించే అవకాశం ఐఏఎస్ అధికారులకు వచ్చినా దాన్ని వదులుకునేలా వారు ఆడిన అట అందరిని విస్మయానికి గురి చేసింది.

చేతిలో వికెట్లు ఉంచుకొని రెండు ఓవర్లలో కేవలం మూడు పరుగులు చేస్తే విజయం సొంతమయ్యే అవకాశం ఉన్నా.. మహా జిడ్డుగా ఆడేసి.. సీఎం జట్టుపై గెలుపు తమకు అసాధ్యమన్నట్లుగా ఐఏఎస్ లు వ్యవహరించిన తీరు చూసినప్పుడు.. ముఖ్యమంత్రి అఖిలేశ్.. అధికారుల్ని ఎంత కంట్రోల్ చేస్తారో అర్థమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైనా సీఎం జట్టును గెలిపించేందుకు యూపీ ఐఏఎస్ అధికారులు పడిన తపన అందరి నోటికి పని చెప్పిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News