అఖిలేశ్ స‌మాజ్ వాది పార్టీని ముంచేస్తాడా?

Update: 2016-09-14 07:48 GMT
ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. అక్క‌డి యువ సీఎం అఖిలేశ్ యాద‌వ్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. త‌న తండ్రి - స‌మాజ్ వాది పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ తో అభిప్రాయ‌భేదాలు... బాబాయి శివ‌పాల్ యాద‌వ్ తో విభేదాల నేప‌థ్యంలో చోటుచేసుకున్న ప‌రిణామాల‌తో క‌ల‌త చెందిన అఖిలేశ్ ఏకంగా ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్లుగా తెలుస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అఖిలేశ్ - శివ‌పాల్ మ‌ధ్య విభేదాల‌లో ములాయం త‌న కుమారుడు అఖిలేశ్ కంటే సోద‌రుడు శివ‌పాల్ వైపే మొగ్గు చూపుతూ అఖ‌లేశ్ ను పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించి త‌మ్ముడికి ఆ స్థానం అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. అది జ‌రిగిన కొద్దిసేప‌టికే అఖిలేశ్ గ‌వ‌ర్న‌రుతో భేటీకి అనుమ‌తి కోర‌డం సంచ‌ల‌నంగా మారింది.  అసెంబ్లీని రద్దు చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన గవర్నర్ ను కలవనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలను జరిపించాలని  గవర్నర్ ను అఖిలేశ్ కోరనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో యూపీ  రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే, అఖిలేష్ ఎందుకు గవర్నర్ ను కలుస్తున్నారన్న విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ విషయంలో సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశముంది.

పార్టీలో చీలిక భ‌యంతో ములాయం త‌న సోద‌రుడు శివ‌పాల్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తూ అఖిలేశ్ మాట‌కు విలువ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన ఆయ‌న తీవ్ర నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు వెళ్తే స‌మాజ్ వాది పార్టీకి న‌ష్టం త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌రిణామాల నేప‌థ్యంలో జాతీయ పార్టీలు బీజేపీ - కాంగ్రెస్ లు కూడా అల‌ర్ట‌యిపోయాయి. అక్క‌డి ప్ర‌భుత్వం క‌నుక ర‌ద్ద‌యితే వెంట‌నే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మై వీలైనంత ల‌బ్ధి పొందేందుకు రెండు పార్టీలూ సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే.. అఖిలేశ్ అనుకున్నంత ప‌ని చేస్తారా లేదంటే ములాయం క‌నుక బుజ్జ‌గిస్తే మెత్త‌బ‌డ‌తారా అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికిప్పుడు అఖిలేశ్ ఎన్నిక‌ల‌కు వెళ్తే మాత్రం న‌ష్టం త‌ప్ప‌ద‌న్న‌ది ములాయం అభిప్రాయం... వ‌చ్చే ఏడాది నాటికి బీజేపీపై మ‌రింత వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని... అప్పుడు ఎస్పీ విజ‌యఢంకా మోగించ‌డం ఖాయ‌మ‌న్న‌ది ములాయం అంచ‌నా. కానీ... అఖిలేశ్ ఇప్పుడు ఆవేశంగా ఎన్నిక‌ల‌కు వెళ్లి ఎస్పీని ముంచుతార‌ని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.
Tags:    

Similar News