సునాక్ స‌తీమ‌ణి.. బ్రిట‌న్ రాణి కంటే ఎక్కువ‌.. అయినా.. ఎంత సింప్లిసిటీ అంటే!

Update: 2022-10-25 16:30 GMT
బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రి రిషి సునాక్ సతీమణి అక్షత మూర్తి భారతీయ మహిళ. గ్లోబల్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు ఎన్.ఆర్ నారాయణ మూర్తి కూతురే అక్షత మూర్తి. అయితే సుసంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ చాలా సాదాసీదా జీవితాన్ని ఇష్టపడతారు. ఇన్ఫోసిస్ కంపెనీ విలువ ప్రస్తుతం దాదాపు 75 బిలియన్ డాలర్లుగా ఉండగా అందులో ఆమెకు 0.93 శాతం ఉంది. దీని విలువ 700 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.5 వేల 700 కోట్లుపైమాటే.

ఇటివలే చనిపోయిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సంపద కంటే అక్షత మూర్తి ఆస్తి విలువే ఎక్కువ. అక్షత మూర్తికి ఇన్ఫోసిస్ నుంచి ప్రతి ఏడాది డివిడెండ్ల రూపంలో పెద్ద మొత్తంలోనే ఆస్తి పెరుగుతుంటుంది. అక్షత మూర్తి తల్లి సుధా మూర్తి. వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చాలా చాలా సింపుల్‌గా ఉంటారు సుధా మూర్తి. సాదాసీదా జీవితాన్ని గడపటానికి ఆమె ఇష్టపడతారు. ఎంతగా అంటే.. పిల్లలు అక్షత, రోహన్ (కొడుకు)లను తోటి విద్యార్థుల మాదిరిగానే ఆటో-రిక్షాలో స్కూల్‌కి పంపించేవారు. అంతేకాదు ఇంట్లో టీవీ కూడా లేకుండా పిల్లల్ని పెంచారంటే అతిశయోక్తిగా అనిపించకమానదు.

అంత సాధారణంగా పిల్లల్ని పెంచారు. పిల్లల పెళ్లిళ్లు కూడా సాధారణంగానే చేశారు. సౌతాంప్టన్‌లో నివసించే ఓ డాక్టర్ కొడుకు అయిన రిషి సునాక్‌కు కూతురు అక్షత మూర్తిని ఇచ్చి పెళ్లి చేశారు. అక్షత మూర్తి ఎంబీఏ చదువుతున్న సమయంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో సునాక్, అక్షత మూర్తికి పరిచయం ఏర్పడింది. వీరి పెళ్లి సాధారణంగా జరిగినప్పటికీ రిసెప్షన్‌కి 1000 మంది   అతిథులు హాజరయ్యారు. రాజకీయ నాయకులు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు ఉన్నారు.

అక్షత మూర్తి 1980లో పుట్టారు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్న ఆమె స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, క్లేర్‌మోంట్ మెక్‌‌కెన్నా కాలేజీ, ఎఫ్ఐడీఎం (ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మెర్చెండైజింగ్)లో చదువుకున్నారు. రిషి సునాక్‌ను 2009లో వివాహమాడారు. వీరికి క్రిష్ణ సునాక్, అనుష్క సునాక్ ఇద్దరు పిల్లలున్నారు. అక్షిత మూర్తి, సునాక్‌లకు నాలుగు ప్రోపర్టీస్ మాత్రమే ఉన్నాయి.

వీటిలో లండన్‌లోని కెన్సింగ్టన్‌లో 7 మిలియన్ పౌండ్ల విలువ చేసే 5-బెడ్‌రూమ్ ఇల్లు ఒకటి ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఒక సొంత ఫ్లాట్ ఉంది. సొంత ఫ్యాషన్ లేబుల్ ‘అక్షత డిజైన్స్’ను 2010లో మొదలుపెట్టారు. ప్రారంభించడానికి ముందే మార్కెటింగ్‌ కోసం శ్రమించారు. భారతీయ సంప్రాదాయాలకు అనుగుణంగా, పాశ్చాత్య దేశాలకు దుస్తులకు దగ్గరగా ఉండేలా.. సుదూర గ్రామాల్లోని ఆర్టిస్టులతో కలిసి అక్షత మూర్తి కష్టపడ్డారని, ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో రాణిస్తున్నారని 2011లో వోగ్ మ్యాగజైన్ పేర్కొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News