ఆకాశంలో వింత శకటం.. ‘టైమ్ మిషన్’ అంటూ ప్రచారం.. నిజమెంత?

Update: 2022-12-07 10:25 GMT
మన బాలయ్య బాబు ‘ఆదిత్య 369’ సినిమాలోని టైమ్ మిషన్ తరహాలో ఒక యూఎఫ్ఓ నిన్నంతా ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఈ వింత శకటాన్ని హైదరాబాద్ వాసులతో పాటు చుట్టుపక్కల జనాలు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వింత శకటంపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ వింత శకటాన్ని చూసిన వారంతా ఇది కాలంతో ప్రయాణించే టైమ్ మిషన్ అని.. గ్రహంతర వాసులు ఉపయోగించే యూఎఫ్ఓ అంటూ ఎవరికి వారు కథలు అల్లుతున్నారు. దీంతో ఈ వింత శకటం అసలు కథ ఏంటో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి కనబరుస్తుండటంతో సోషల్ మీడియాతో ఈ శకటానికి సంబంధించి పలు వీడియోలు వైరలవుతున్నాయి.

నిన్నంత ఆకాశంలో కన్పించిన ఈ వింత శకటం నేడు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లోని ఓ పొలంలో ప్రత్యక్షమైంది. ఈ వింత శకటం ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెవిన్యూ.. పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వింత శకటాన్ని పరిశీలించారు.

అయితే ఇది అందరూ అనుకున్నట్లుగా టైమ్ మిషనో.. గ్రహంతర వాసులు ఉపయోగించే యూఎఫ్ఓ ను కాదని అధికారులు వెల్లడించారు. వాతావరణంలోని మార్పులను అధ్యయనం చేసేందుకు హీలియం బెలూన్ ను సైంటిస్టులు గగనతలంలోకి పంపిచినట్లు తెలిపారు. ఈ బెలూన్ ను ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్ స్టిట్యూట్ ఆప్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో వాతావరణంలోకి పంపారని వెల్లడించారు.

రెండ్రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వింత శకటం టైమ్ మిషనో.. యూఎఫ్ఓ నో కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా ఈ హీలియం బెలూన్ మాత్రం ‘ఆదిత్య 369’ మూవీలో టైమ్ మిషన్ తరహాలోనే ఉందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి.
Tags:    

Similar News