అన్ని పార్టీల అన్వేషణ వారి కోసమేనా?

Update: 2022-12-27 06:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారం సాధించాలని అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా భారీ వ్యూహాలను రచిస్తున్నాయి.

175కి 175 సీట్లు సాధించాలనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా వైసీపీనే గెలుస్తుందని జగన్‌ బల్లగుద్ది చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వైసీపీ 175కి 175 కాదు కదా.. పులివెందులలో కూడా జగన్‌ గెలవలేడని, ముందు పులివెందులలో గెలవాలని సవాల్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు అన్వేషణ సాగిస్తున్నాయి. అంగ బలం, అర్థ బలాలు కలిగినవారి కోసం గాలిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతో పోలిస్తే తమ అభ్యర్థి బలహీనమని భావిస్తే వారిని పక్కనపెట్టడానికి కూడా వెనుకాడబోవని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ధీటైన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలను అప్పుడే అన్ని పార్టీలు ముమ్మరం చేశాయని తెలుస్తోంది.

వాస్తవానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. అయితే ముందుగానే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ప్రత్యర్థి పార్టీల్లో బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడం.. వారికి, వారి కుటుంబ సభ్యులకు సీట్లు ఇస్తామని హామీ ఇవ్వడం వంటివి చేస్తున్నాయని అంటున్నారు.

ఆయా పార్టీల్లో అసంతృప్త నేతలపై పార్టీలు దృష్టి సారించాయి. విజయవాడ ఎంపీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని కేశినేని నాని ప్రకటించడంతో అతడికి ధీటైన అభ్యర్థిని టీడీపీ వెతుకుతోంది. కేశినేని స్థానంలో ఆర్థికంగా బలవంతుడైన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ పై దృష్టి సారించిందని అంటున్నారు.

మరోవైపు వైసీపీ కూడా ఈసారి గట్టి అభ్యర్థిని దించాలని ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసినా పొట్లూరి వరప్రసాద్‌ మరోమారు తనకే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. తనకు సీటు ఇస్తే విజయవాడ ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చును కూడా తానే పెట్టుకుంటానని చెబుతున్నట్టు సమాచారం.

అలాగే నెల్లూరు ఎంపీ స్థానం నుంచి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఈయన బడా కాంట్రాక్టర్‌. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మెరుగైన స్థానాలు సాధించాలని ఆశిస్తున్న టీడీపీ ఆనం రామ నారాయణరెడ్డిపై వల వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించి నెల్లూరు ఎంపీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇలా పలు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులపైనే ఆయా పార్టీలు ఫోకస్‌ చేసినట్టు సమాచారం. అంగ, అర్థ బలాలు కలిగి ఉండి వివాద రహితులకు సీట్లు ఇవ్వాలనే వ్యూహంలో ప్రధాన పార్టీలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News